డ్రైవ‌ర్ లేకుండానే బ‌స్సు ప‌రుగులు.. ప్ర‌యాణీకుల ఆర్త‌నాదాలు.. కండ‌క్ట‌ర్ చాక‌చ‌క్యం

Road Accident in Nellore Districtబ‌స్టాండ్ నుంచి ప్ర‌యాణీకుల‌తో ఆర్టీసీ బ‌స్సు బ‌య‌లుదేరింది. మార్గ‌మ‌ధ్యంలో ఓ కారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Aug 2022 3:45 AM GMT
డ్రైవ‌ర్ లేకుండానే బ‌స్సు ప‌రుగులు.. ప్ర‌యాణీకుల ఆర్త‌నాదాలు.. కండ‌క్ట‌ర్ చాక‌చ‌క్యం

బ‌స్టాండ్ నుంచి ప్ర‌యాణీకుల‌తో ఆర్టీసీ బ‌స్సు బ‌య‌లుదేరింది. మార్గ‌మ‌ధ్యంలో ఓ కారు వేగంగా దూసుకువ‌చ్చి బ‌స్సును ఢీ కొట్టింది. దీంతో బ‌స్సు డ్రైవ‌ర్ ఎగిరి రోడ్డుపై ప‌డిపోయాడు. డ్రైవ‌ర్ లేకుండానే బ‌స్సు ముందుకు వెలుతోంది. ఆ స‌మ‌యంలో ఆ బ‌స్సులో ఉన్న ప్ర‌యాణీకులు ప్రాణ భ‌యంతో కేక‌లు పెట్టారు. అయితే.. కండ‌క్ట‌ర్ అప్ర‌మ‌త్త‌తో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఈ ఘ‌ట‌న నెల్లూరు జిల్లాలో బుధ‌వారం చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. కావ‌లి డిపోకు చెందిన ఆర్టీసీ బ‌స్సు 24 మంది ప్ర‌యాణీకుల‌తో కావ‌లి నుంచి నెల్లూరు బ‌య‌లుదేరింది. కావలి సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద బ‌స్సును ఎదురుగా వేగంగా వ‌స్తున్న కారు అదుపు త‌ప్పి ఢీ కొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ ప్రసాద్ ఎగిరి అమాంతం రోడ్డుపై ప‌డిపోయాడు. బ‌స్సు ర‌న్నింగ్‌లో నే ఉంది. డ్రైవ‌ర్ లేకుండా బ‌స్సు ముందుకు వెలుతుండంతో ప్ర‌యాణీకులు ప్రాణ భ‌యంతో ఆర్త‌నాదాలు చేశారు.

అప్ర‌మ‌త్త‌మైన కండ‌క్ట‌ర్ నాగ‌రాజు స్టీరింగ్ వ‌ద్ద‌కు వ‌చ్చి బ్రేకులు వేశాడు. దీంతో బ‌స్సు ఆగింది. ప్ర‌యాణీకులు అంతా ఊపిరిపీల్చుకున్నారు. అప్ప‌టికే బ‌స్సు 150 మీట‌ర్ల దాకా ముందుకు వెళ్లింది. కంక్ట‌ర్ అప్ర‌మ‌త్త‌తో పెను ప్ర‌మాదం త‌ప్పింది. లేదంటే ఘోరం జ‌రిగి ఉండేది. ఈ ఘ‌ట‌న‌లో డ్రైవ‌ర్‌తో పాటు ప‌ది మంది ప్ర‌యాణీకులు గాయ‌ప‌డ్డారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తులు స్వ‌లంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆ కారును విశాఖ పట్టణానికి చెందిన విజయ్‌పంత్ అనే డాక్టర్‌కు చెందిన‌దిగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేప‌ట్టారు.

Next Story