ఆదివారం తెల్లవారుజామున నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద ఆగి ఉన్న లారీని టెంపో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువాత పడగా.. మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు చిన్నారులు క్షేమంగా బయటపడ్డారు. మృతులను తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి చెందిన వారిగా గుర్తించారు. చెన్నైకి చెందిన వీరంతా శ్రీశైలం తదితర ప్రాంతాల్లో ఆద్యాత్మిక యాత్రను ముగించుకుని టెంపోలో నెల్లూరు బయలుదేరారు.
తెల్లవారుజామున 2.15గంటల సమయంలో టెంపో దామరమడుగు శివారులోకి రాగానే పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. వేగంగా లారీని ఢీ కొట్టడంతో టెంపో ముందుభాగం మొత్తం నుజ్జునుజ్జు అయ్యింది. డ్రైవర్ గుర్నాథంతో పాటు వాహనంలో ముందు కూర్చున్న మరో ఆరుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరిని నెల్లూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో టెంపోలో 15 మంది ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తు, పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన వాహనాన్ని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.