'ముందు సీఎం చంద్రబాబు ఆ పని చేయించాలి'.. రిటైర్డ్ ఐపీఎస్‌ నాగేశ్వరరావు వివాదాస్పద ట్వీట్

రిటైర్డ్ ఐపీఎస్‌ ఎం.నాగేశ్వరరావు.. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

By -  అంజి
Published on : 15 Sept 2025 12:08 PM IST

Retired IPS Nageswara Rao, AP CM Chandrababu, APnews

రిటైర్డ్ ఐపీఎస్‌ నాగేశ్వరరావు వివాదాస్పద ట్వీట్.. సీఎం చంద్రబాబే టార్గెట్‌గా.. 

రిటైర్డ్ ఐపీఎస్‌ ఎం.నాగేశ్వరరావు.. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో 2025 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు మనవడు దేవాంశ్‌కు అభినందనలు తెలిపిన నాగేశ్వరరావు తనదైన శైలిలో సీఎం చంద్రబాబుపై సెటైర్‌ వేశారు.

ప్రతి జంట ముగ్గురు పిల్లలను కనాలి అనే సీఎం చంద్రబాబు నూతన విధాన నిర్ణయం ప్రకారంగా.. మంత్రి లోకేశ్ - బ్రాహ్మణీల ద్వారా ఇంకో ఇద్దరు పిల్లలను కనిపించండి అంటూ నాగేశ్వరరావు హాట్‌ కామెంట్స్‌ చేశారు. 'ఇంట గెలిచి రచ్చ గెలవాలి' అనేది అనాది వస్తున్న నానుడి అని.. దాన్ని సీఎం చంద్రబాబు పాటించాలన్నారు. ఒక వేళ ఈ నానుడి గనుక సీఎం చంద్రబాబు పాటించలేకపోతే.. 'ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి' అనే నానుడిని నిజం చేసిన వారు అవుతారని అన్నారు.

ప్రతి జంట ముగ్గురు లేక నలుగురు పిల్లలను కనాలి అని ప్రజలకు ఉద్బోధ చేసే చంద్రబాబు.. తాను పాటించి చూపించాలన్నారు. ప్రజలకు ఒక నియమం పాలకుడైన ఆయనకు వేరొక నియమమా? అని ప్రశ్నించారు. ''నాయకుడు అనే వారు తాను చెప్పేది ఆచరించాలి కదా? తాను చెప్పేది పాటించమనే కదా నేను ఆయనను అడిగింది. పాలకులను ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామా?'' అని ఎక్స్‌ వేదిగా నాగేశ్వరరావు ట్వీట్‌ చేశారు.

Next Story