'అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకపోతే రాజీనామా చేయ్'.. వైఎస్ జగన్‌పై షర్మిల ఫైర్
అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారాం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసిందని మాజీ సీఎం జగన్‌పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.
By అంజి Published on 11 Nov 2024 7:37 AM GMT'అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకపోతే రాజీనామా చేయ్'.. వైఎస్ జగన్‌పై షర్మిల ఫైర్
అమరావతి: అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారాం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసిందని మాజీ సీఎం జగన్‌పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఆయన తీరు అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుందన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాననడం మీ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు. అసెంబ్లీకి వెళ్లే దమ్ము, ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలన్నారు.
''టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు దిక్కులేదు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. మహిళలపై దాడులు ఆగడం లేదు. ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. బెల్టు షాపుల దందాను అరికట్టలేదు. 5 నెలలైనా ఒక్క ఉద్యోగం భర్తీ కాలేదు. రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా గొంతుక అయ్యే అవకాశం వైసీపీకి ప్రజలు ఇస్తే... ప్రతిపక్షం ఇస్తేనే వస్తాం అనడం సిగ్గు చేటు. ప్రతిపక్షం లేకుంటే సభలోనే ప్రజాపక్షం అవ్వాలని ఇంగితం కూడా లేకపోవడం బాధాకరం'' అని వైఎస్ షర్మిల అన్నారు.
''1994లో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకే పరిమితం అయినా.. కుంగిపోలేదు. మీ లెక్క హోదా కావాలని మారం చేయలేదు. 26 మంది సభ్యులతో సభలో ప్రజల పక్షంగా నిలబడ్డాం. ఎన్నో సమస్యలపై ఆనాడు టీడీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించింది కాంగ్రెస్ పార్టీ. 2014లో కేంద్రంలో 44 సీట్లకే పరిమితం అయినా, 2019లో 52 సీట్లే వచ్చినా ప్రతిపక్ష హోదా కావాలని అడగలేదు. హోదా లేకున్నా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించారు. నియంత మోడీ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. దేశ ప్రజల సమస్యలపై కాంగ్రెస్ గొంతుకగా మారింది. ఇప్పటికైనా మీ పిచ్చితనాన్ని పక్కన పెట్టీ అసెంబ్లీకి వెళ్ళండి. కూటమి నిర్లక్ష్యాన్ని ఎండగట్టండి. అసెంబ్లీకి వెళ్ళే దమ్ము ధైర్యం లేకుంటే వైసీపీ శాసనసభా పక్షం మొత్తం రాజీనామాలు చేయండి. అప్పుడు ఇంట్లో కాదు..ఎక్కడైనా కూర్చుని తాపీగా మాట్లాడుకోండి'' అని షర్మిల ట్వీట్ చేశారు.