హైకోర్టులో చంద్రబాబుకి ఊరట..అంగళ్లు కేసులో బెయిల్

అంగళ్లు కేసులో చంద్రబాబుకి హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

By Srikanth Gundamalla  Published on  13 Oct 2023 5:37 AM GMT
relief, chandrababu,  ap high court, bail, angallu case,

హైకోర్టులో చంద్రబాబుకి ఊరట..అంగళ్లు కేసులో బెయిల్

టీడీపీ అధినేత చంద్రబాబుకి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఊరట లభించింది. అంగళ్లు కేసులో చంద్రబాబుకి హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నమయ్య జిల్లా ముందివేడు పోలీసులు తనపై కేసు నమోదు చేసిన కేసులో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో గురువారమే వాదనలు ముగిశాయి. హైకోర్టులో శుక్రవారం తీర్పు వెల్లడిస్తామని చెప్పి తీర్పు రిజర్వ్ చేసింది. అయితే.. తాజాగా చంద్రబాబుకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూనే.. రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దాంతో.. చంద్రబాబుకి హైకోర్టులో ఊరట లభించినట్లు అయ్యింది.

అయితే.. 'సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' పేరుతో ఆగస్టు 4న చంద్రబాబు అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. అంగళ్లు మీదుగా ఆయన వెళ్తున్న సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడటం.. టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటన తర్వాత చంద్రబాబు సహా టీడీపీకి చెందిన మొత్తం 179 మందిపై కురబలకోట మండలం ముదివేడు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబుని ఏ1గా చేర్చారు పోలీసులు. హత్యాయత్నంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదే కేసులో పలువురు టీడీపీ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించగా వారికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. తాజాగా చంద్రబాబు పిటిషన్‌పై విచారణ జరిగింది. చంద్రబాబుపైనే దాడులు చేశారని.. బాధితులపై కేసు నమోదు సరికాదని న్యాయవాది వాదించారు. అలాగే గతంలో ఇదే కేసులో పలువురికి బెయిల్‌ లభించిన విషాన్ని చెప్పారు. దాంతో.. ఏ1గా ఉన్న చంద్రబాబుకి కూడా విచారణ అనంతరం ముందస్తు బెయిల్‌ ఇచ్చింది ఏపీ హైకోర్టు.

Next Story