కరెంట్ ఛార్జీలపై ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..2026-27లో ఛార్జీల పెంపు లేదు
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ నియంత్రణ కమిషన్ (APERC) తీపి కబురు అందించాయి
By - Knakam Karthik |
కరెంట్ ఛార్జీలపై ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..2026-27లో ఛార్జీల పెంపు లేదు
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ నియంత్రణ కమిషన్ (APERC) తీపి కబురు అందించాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ ఛార్జీలను పెంచకూడదని ఏపీఈఆర్‌సీ నిర్ణయించింది. డిస్కామ్‌లు రూ. 17,508 కోట్ల ఆదాయ లోటును అంచనా వేసినప్పటికీ, కమిషన్ దానిని రూ. 15,790 కోట్లుగా నిర్ధారించి, ఆ భారాన్ని వినియోగదారులపై పడకుండా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సబ్సిడీ మద్దతు ఇవ్వడానికి అంగీకరించింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 1.13 కోట్ల గృహ వినియోగదారులకు భారీ ఊరట లభించడమే కాకుండా, 22 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగనుంది. అలాగే, డీబీటీ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ మరియు వెనుకబడిన వర్గాలకు చెందిన మరో 22 లక్షల కుటుంబాలకు రాయితీ విద్యుత్ అందుతుంది.
వాణిజ్య మరియు పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించేలా కమిషన్ పలు కీలక మార్పులు చేపట్టింది. వాణిజ్య విద్యుత్ టారిఫ్‌ను యూనిట్‌కు రూ. 12.25 నుండి రూ. 9.95కు తగ్గించడం ద్వారా సుమారు 2 లక్షల మంది వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది. కుటీర పరిశ్రమల లోడ్ పరిమితిని 10 హెచ్‌పి నుండి 20 హెచ్‌పికి పెంచడం ద్వారా 18,000 చిన్న పరిశ్రమలకు మేలు జరుగుతుంది. వీటితో పాటు సోలార్ మాడ్యూల్ తయారీకి ప్రత్యేక కేటగిరీని కేటాయించడం, నీటి శుద్ధి కర్మాగారాలు మరియు ప్రింటింగ్ ప్రెస్‌లను పారిశ్రామిక యూనిట్లుగా గుర్తించడం వంటి సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు. వినియోగదారులపై అదనపు భారం మోపే నాన్-టెలిస్కోపిక్ బిల్లింగ్ వంటి డిస్కామ్‌ల ప్రతిపాదనలను కమిషన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.
మరోవైపు, విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కామ్‌ల) పనితీరును మెరుగుపరచడానికి కమిషన్ కఠిన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే వసూలు చేయాలని, ప్రైవేట్ బకాయిలను తగ్గించడానికి పటిష్ట వ్యూహాలు అమలు చేయాలని సూచించింది. విద్యుత్ భద్రతపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వాట్సాప్ మరియు వెబ్‌సైట్ల ద్వారా పబ్లిక్ రిపోర్టింగ్ వ్యవస్థలను బలోపేతం చేయాలని ఆదేశించింది. జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సేవలందిస్తూ, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ నూతన విద్యుత్ విధివిధానాలు రూపొందించబడ్డాయి.