పోలవరం నిర్వాసితులకు పునరావాసంపై మంత్రి నిమ్మల కీలక ప్రకటన
ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశమయ్యారు
By - Knakam Karthik |
పోలవరం నిర్వాసితులకు పునరావాసంపై మంత్రి నిమ్మల కీలక ప్రకటన
ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, ప్రాజెక్టు నిర్మాణానికి సంబందించిన పెండింగ్ డిజైన్స్ అనుమతులపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఇరిగేషన్ అడ్వైజర్ ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్సి నరసింహామూర్తి, మరియు పిపిఏ, సిడబ్ల్యూసి అధికారులు, ఇతర కేంద్ర ఏజెన్సీల ప్రతినిధులు, నిపుణులు పాల్గొన్నారు.
అనంతరం మంత్రి నిమ్మల మాట్లాడుతూ..గత ప్రభుత్వం హయాంలో పోలవరం ప్రాజెక్టు ను అనిశ్చితిలోకి నెట్టివేసింది. కూటమి ప్రభుత్వం లో పోలవరానికి అమితమైన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఏపి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ వల్ల పనులు తిరిగి వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఏపి సీఎం నిర్దేశించిన 2027 లక్ష్యానికి అనుగుణంగా పనులు జరుగుతున్నాయి . వర్షాకాలంలో కూడా డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి . అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. చిత్తశుద్ధి తో పనులు పూర్తి చేస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం 2019లో కూడా కొనసాగినట్లయితే ఇప్పటికే పోలవరం పనులు పూర్తయ్యేయి. గత ప్రభుత్వ హయాంలో 17 నెలల పాటు పోలవరం పనులు జరగలేదు. డయాఫ్రం వాల్ దెబ్బ తినడానికి గత ప్రభుత్వ తప్పిదాలే కారణం. రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపన చేశారు. కేంద్రం హెచ్చరికలను పట్టించుకోకుండా జగన్ సర్కార్ పోలవరం ప్రాజెక్టును రివర్స్ టెండరింగ్ పేరుతో అడ్డుకుంది. పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన ప్యాకేజీని కూడా జగన్ సర్కార్ ఇవ్వలేదు. పోలవరం నిర్వాసితులు రోడ్డెక్కి ఆందోళన కూడా చేశారు. 38వేల 60 కుటుంబాలకు గాను మొదటి విడతగా 28946 మందికి పునరావాసం కల్పించాము. మౌలిక వసతులకు జగన్ సర్కార్ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు..అని నిమ్మల అన్నారు.
2026 మే నెల చివరి వరకు 28946 మందికి 900 కోట్లతో పునరావాసం కల్పిస్తాం. 2027 మార్చి వరకు పోలవరం నిర్వాసితులను పునరావాసం పూర్తి చేస్తాం. పడకేసిన పోలవరం పనులను కార్యరూపం దాల్చేలా పనిచేస్తున్నాం. పోలవరం పనులు
జరుగుతున్న తీరు పట్ల కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం పోలవరం నిర్మాణానికి ఇచ్చే ప్రతి రూపాయి ను సద్వినియోగం చేస్తున్నాము . 2027 డిసెంబర్ నాటికి ప్రధాని చేతుల మీదుగా పోలవరాన్ని జాతికి అంకితం చేసేందుకు ముందుకు వెళుతున్నాము. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను ఆహ్వానించాము. బీహార్ ఎన్నికల తర్వాత ఆయన వస్తానని చెప్పారు..అని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు.