విద్యుత్ శాఖలో నియామకాలపై గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి
విద్యుత్ శాఖలో సిబ్బంది కొరతను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతితో త్వరలోనే నియామక ప్రక్రియ చేపడతామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.
By - Medi Samrat |
విద్యుత్ శాఖలో సిబ్బంది కొరతను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతితో త్వరలోనే నియామక ప్రక్రియ చేపడతామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. గురువారం నాడు మండలిలో సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు అడిగిన ప్రశ్నలకు మంత్రి గొట్టిపాటి సమాధానం చెప్పారు. క్షేత్ర స్థాయిలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు సిబ్బంది అవసరం ఉందని మంత్రి తెలిపారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా, రీస్టోరేషన్ పనుల కోసం అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ వంటి వివిధ పద్ధతుల ద్వారా నియామకమైన 18,000 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. రెగ్యులర్ మెయింటినెన్స్, విద్యుత్ అంతరాయాలు తగ్గించడంతో పాటు ఓల్టేజ్ స్టెబిలిటీని పెంచడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. వినియోగదారులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించే లక్ష్యంతో విద్యుత్ శాఖ ముందుకు వెళ్తుందని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న 5,580 మంది సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్ లకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నామని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. విశాఖపట్నంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ద్వారా సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్ లకు శిక్షణ ఇచ్చి వారి సేవలను వినియోగించేకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్ లు విద్యుత్ శాఖకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే 77 శాతం పైగా ఖాళీలు భర్తీ అయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అదే విధంగా ఏఈల నియామక ప్ర్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. లైన్ మెన్ ల నియామకం పైనా ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని మంత్రి సభ్యులకు వివరించారు. అదే విధంగా క్షేత్ర స్థాయి విద్యుత్ అవసరాలకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా అందుబాటులో ఉన్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వినియోగించుకుంటున్నామన్నారు.
రూ.8 వేల కోట్లతో ఆర్డీఎస్ఎస్ పనులు..
వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయం విద్యుత్ సరఫరా చేయడం కోసం రూ.8 వేల కోట్లతో ఆర్డీఎస్ఎస్ పనులు చేపట్టినట్లు మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. ఫీడర్ లెవల్ బైఫర్కేషన్ ద్వారా అగ్రికల్చర్ ఫీడర్లను వేరు చేస్తున్నామని చెప్పారు. దీని ద్వారా గ్రామాల్లో ఎటువంటి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. ఇప్పటికే 75 శాతం పనులు పూర్తయ్యాయని, వచ్చే ఏప్రిల్ నాటికి 100 శాతం పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదే విధంగా విశాఖపట్నం వంటి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టం కలుగకుండా అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి ప్రకటించారు. తుపానులు, వరదలు వచ్చినప్పుడు విద్యుత్ శాఖ ఉద్యోగులు ప్రాంతాలు, డిస్కంలతో సంబంధం లేకుండా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలు వరద ప్రభావానికి గురైనప్పుడు ఉద్యోగులందరూ రాత్రి, పగలూ కష్టపడి 24 గంటల్లోనే ప్రజలకు విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ పనురుద్ధరణ చేపట్టినట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు.