అమరావతి: వాట్సాప్ గవర్నెన్స్‌లో రేషన్ కార్డు సేవలు ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చాయి. 95523 00009 నంబరకు Hi అని మెసేజ్ చేస్తే 'సేవను ఎంచుకోండి' అనే ఆప్షన్ వస్తుంది. ఆ తర్వాత పౌర సేవలు, సివిల్ సప్లయిస్ సేవలపై క్లిక్ చేయాలి. అప్పుడు దీపం స్థితి, రైస్ డ్రా, ఈ కేవైసీ, రైస్ కార్డు సమర్పణ, ఆధార్ సీడింగ్, కార్డు విభజన తదితర 8 సేవలు కనిపిస్తాయి. ఈ సేవల ద్వారా రేషన్ కార్డులో మార్పులు చేసుకోవడం, ఇతర సేవలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో కొత్త రైస్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే ఆప్షన్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవాళో, రేపో కొత్త రైస్ కార్డుకు దరఖాస్తు చేసుకునే ఆప్షన్ కూడా వస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రంలో మొత్తం బియ్యం కార్డుల సంఖ్య 1,46,21,223 కాగా, ఇందులో దాదాపు 4,24,59,028 మంది ఉన్నారు. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, 80 ఏళ్లు పైబడిన వ్యక్తులు సహా 6,45,765 మందికి eKYC నిబంధనను పాటించకుండా మినహాయింపు ఇచ్చారు. eKYC ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన వారందరికీ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఉచితంగా ఇవ్వబడతాయి. ఒంటరి వ్యక్తులు, 50 ఏళ్లు పైబడిన అవివాహితులు, విడిపోయిన జీవిత భాగస్వాములు, అనాథాశ్రమాలలో నివసించేవారు, ట్రాన్స్‌జెండర్లు బియ్యం కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సామాజిక భద్రతా పెన్షన్లు పొందుతున్న కళాకారులు, కొండ ప్రాంతాలలో నివసించే 12 తెగల సభ్యులకు ప్రత్యేక అంత్యోదయ అన్న యోజన కార్డులు అందించబడతాయి.