రాజమండ్రి కల్తీ పాల విషాదం..16కు చేరిన మరణాల సంఖ్య
రాజమండ్రి కల్తీ పాల ఘటనలో విషాదం కొనసాగుతోంది.
By - Knakam Karthik |
రాజమండ్రి కల్తీ పాల విషాదం..16కు చేరిన మరణాల సంఖ్య
రాజమండ్రి కల్తీ పాల ఘటనలో విషాదం కొనసాగుతోంది. తాజాగా మరో ప్రాణం పోవడంతో మరణాల సంఖ్య 16కు చేరుకుంది. గత నెల రోజులుగా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న 72 ఏళ్ల నాగేశ్వరరావు చికిత్స పొందుతూ కన్నుమూశారు. కల్తీ పాలు తాగిన కారణంగా ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు కేవలం కొండబాబు (64) అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడగా, మిగిలిన వారందరూ కిడ్నీ వైఫల్యం మరియు ఇతర ఆరోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపుతోంది.
పోలీసుల దర్యాప్తులో ఈ మరణాలకు ప్రధాన కారణం పాలను నిల్వ చేసే ఫ్రీజర్‌లోని కూలెంట్ అని తేలింది. ఫ్రీజర్ నుంచి అత్యంత విషపూరితమైన ఇథిలీన్ గ్లైకాల్ రసాయనం లీక్ అయ్యి పాలల్లో కలవడంతో, ఆ పాలు తాగిన వారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. రంగు, రుచిలో పెద్దగా మార్పు లేకపోవడంతో బాధితులు ఆ పాలను సేవించి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. ఆహార భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం మరియు యంత్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వల్లే ఇంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని అధికారులు పేర్కొంటున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.