మాజీ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తన సొంత నియోజకవర్గం పులివెందులలో రెండు రోజు పర్యటనలో ఉన్నారు. ఇవాళ అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన రాజారెడ్డి ఐ సెంటర్ (రాజారెడ్డి నేత్ర వైద్యశాల)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి సమస్యలన్నింటికీ ఇక్కడ వైద్య సేవలు అందుతాయని ఆయన చెప్పారు. ఈ ఆస్పత్రిలో పని చేసి రూపాయి వైద్యుడిగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు తెచ్చుకున్నారని స్థానిక నేతలు తెలిపారు.
కాగా రాజారెడ్డి ఐ సెంటర్‌కు భారీగా స్థలం సమకూర్చడంతో పాటు రూ.10 కోట్లు వెచ్చించి ఆధునిక భవనం, అత్యాధునిక పరికరాలతో వైద్యశాలని వైయస్‌ఆర్ ఫౌండేషన్ తీర్చిదిద్దింది. ఈ ఐ సెంటర్‌లో రోజుకు 5 వేల ఆపరేషన్లు చేసేలా పరికరాలు, 25 వార్డులు ఏర్పాటు చేశారు. ఎల్వీ ప్రసాద్ కంటి వైద్య విజ్ఞాన సంస్థ నేతృత్వంలో ఈ ఆస్పత్రి నిర్వహణ ఉండనుంది. కంప్యూటర్‌తో కంటి పరీక్షలు, డయాగ్నస్టిక్ సేవలు అందించనున్నారు. పులి వెందుల చుట్టు పక్కల గ్రామాల్లో కంటి సమస్యతో బాధపడుతున్న వారికి ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు చేస్తారు.