విశాఖ రైల్వే జోన్‌ డీపీఆర్‌కు రైల్వేబోర్డు పచ్చజెండా

విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ అంశంలో కీలక ముందడుగు పడింది.

By Knakam Karthik
Published on : 24 July 2025 11:18 AM IST

Andrapradesh, Vishakapatnam, South Coast Railway Zone, Detailed Project Report

విశాఖ రైల్వే జోన్‌ డీపీఆర్‌కు రైల్వేబోర్డు పచ్చజెండా

విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ అంశంలో కీలక ముందడుగు పడింది. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌కు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. రైల్వే జోన్‌ సరిహద్దులు, అందులోని డివిజన్లు, వీటి పరిధి, సిబ్బంది, మౌలికవసతులు తదితర పూర్తి వివరాలతో కూడిన సవరించిన డీపీఆర్‌ను జోన్‌ ప్రత్యేక అధికారి ఈ ఏడాది జనవరి 25వ తేదీన రైల్వే బోర్డుకు పంపించారు. దీనిని పరిశీలించిన రైల్వే బోర్డు సవరించిన డీపీఆర్‌కు ఆమోదం తెలుపుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. అదే విధంగా డీపీఆర్‌లో పేర్కొన్న కొన్ని అంశాలపై పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. వాటిని అనుసరించాలని కోరుతూ దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ జనరల్‌ మేనేజర్‌కు ఆదేశాలు జారీ చేసింది.

రైల్వే బోర్డు తాజా ఆమోదంతో కొత్త జోన్‌ పరిధిలోకి వచ్చే దక్షిణ మధ్యరైల్వే ఆస్తులు, పోస్టులు ఇలా ఉన్నాయి.. కొత్తగా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ పరిధిలో ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు చెందిన ఆస్తులు, సిబ్బంది, ఆమోదిత పోస్టులను బదలాయించేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. దక్షిణ మధ్య రైల్వే, తూర్పుకోస్తా రైల్వే జోన్ల పరిధిలోని సిబ్బంది, ట్రాక్‌ మెషీన్లను బదలాయించేందుకు మాత్రం ఆమోదించలేదు. కొత్త రైల్వే జోన్‌ కేంద్రమైన విశాఖపట్నంలో సివిల్‌ పనులకు అదనంగా 200 కోట్ల రూపాయలు అవసరమని డీపీఆర్‌లో పేర్కొనగా, ఆ ప్రతిపాదనలు పంపితే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని బోర్డు పేర్కొంది. జోన్ హెడ్ క్వార్టర్స్ నిర్మిస్తున్న ముడసర్లోవలో అత్యవసర వార్డుతో హెల్త్‌ యూనిట్‌ అవసరమని ప్రతిపాదించగా, ప్రస్తుతం ఇది అవసరం లేదని బోర్డు నిర్ణయించింది. గుణుపూర్‌-తేరుబలి కొత్త లైన్‌ పూర్తయ్యే వరకు గుణుపూర్‌-పర్లాఖెముండి సెక్షన్‌ సహా, నౌపడ-గుణుపూర్‌ రైల్వే లైన్‌ను కొత్తగా ఏర్పాటయ్యే విశాఖ డివిజన్‌లో ఉంచాలంటూ డీపీఆర్‌లో ప్రతిపాదించారు.

అయితే కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించిన జోన్‌ పరిధికి అనుగుణంగా ఈ ప్రతిపాదన లేకపోవడంతో దీనిని కూడా రైల్వే బోర్డు అంగీకరించలేదు. కొత్తగా జీఎం పోస్టు మినహా, మరే ఇతర గెజిటెడ్, నాన్‌ గెజిటెడ్‌ పోస్టులు సృష్టించవద్దని తెలిపింది. కొత్త రైల్వే జోన్‌ ప్రధాన కేంద్రానికి, విశాఖ డివిజన్‌కు అవసరమైన సిబ్బంది కోసం డీపీఆర్‌లో ప్రతిపాదన చేయగా, వాటిని బోర్డు ఆమోదం తెలిపింది. ఆయా సెక్షన్లలో అధికారులు, సిబ్బంది ఎక్కడ పనిచేస్తున్నవారు అక్కడే అన్న విధానంలో కేటాయించనున్నారు. ఫీల్డ్‌ సిబ్బందిని మాత్రమే విభజిస్తారు. కొత్త జోన్‌ ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో అధికారుల కోసం అద్దెకు తీసుకునే నివాసాలకు చెందిన ప్రతిపాదనలు పంపాలని బోర్డు పేర్కొంది. అధికారులు, ఉద్యోగుల సీనియారిటీకి సంబంధించిన విషయంలోనూ రైల్వే బోర్డు పలు సూచనలు చేసింది.

Next Story