Ration Distribution: పేద ప్రజలకు శుభవార్త.. రేషన్‌లో మళ్లీ రాగులు, జొన్నలు
మారుతున్న ప్రజల జీవన విధానం, వారి ఆరోగ్య సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పోషక విలువలు కలిగిన తృణధాన్యాలను ఉచితంగా సరఫరా చేస్తోంది.
By - అంజి |
Ration Distribution: పేద ప్రజలకు శుభవార్త.. రేషన్‌లో మళ్లీ రాగులు, జొన్నలు
అమరావతి: మారుతున్న ప్రజల జీవన విధానం, వారి ఆరోగ్య సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పోషక విలువలు కలిగిన తృణధాన్యాలను ఉచితంగా సరఫరా చేస్తోంది. రేషన్‌లో బియ్యం, చక్కెరతో పాటు రాగులు, జొన్నలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. రాయలసీమ జిల్లాలైన అనంతపురం, కర్నూలు, శ్రీసత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప, నంద్యాలలో ఏప్రిల్ నుంచే రాగులు, జోన్నలు పంపిణీ చేస్తుండగా.. ఈ నెల నుంచి ఉత్తర కోస్తాలో ప్రారంభించింది.
ఈ డిసెంబరు నెల నుంచి రాగుల పంపిణీని ఉత్తర కోస్తా ప్రాంతంలోని విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు విస్తరించింది. ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో జొన్నల పంపిణీని ప్రారంభించింది. పలు జిల్లాల్లో రాగులు, ఇంకొన్ని చోట్ల జొన్నలు అందజేస్తోంది. 20 కిలోల రేషన్ తీసుకునే కుటుంబానికి గరిష్ఠంగా 3 కిలోల వరకు రాగులు, జొన్నలు, 17 కిలోల బియ్యం ఇస్తోంది. కాగా టీడీపీ ప్రభుత్వం గతంలోనూ రాగులు, రాగి పిండిని పంపిణీ చేసింది.
గతంలో జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా కేంద్ర సర్కార్ ఎఫ్‌సీఐ ద్వారా రాష్ట్రంలో పీడీఎస్ అవసరాలకు సరిపడా రాగులు, జొన్నలను ఇచ్చేది. ఇప్పుడు కేంద్రం కేటాయించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే వాటిని టెండరు ప్రక్రియ ద్వారా ప్రొక్యూర్ చేస్తోంది. ఆ తర్వాత రేషన్ కార్డుదారులకు ఉచితంగా సరఫరా చేస్తోంది. రాగులు, జొన్నల పట్ల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే దశలవారీగా అన్ని జిల్లాల్లోనూ రాగులు, జొన్నలు పంపిణీ చేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.