Pulse Polio: నేడు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
నేడు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇవాళ కచ్చితంగా ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి.
By - అంజి |
Pulse Polio: నేడు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
అమరావతి: నేడు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇవాళ కచ్చితంగా ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి. 38,267 బూత్‌ల ద్వారా 54,07,6633 మంది చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయనున్నారు.
పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జి.వీరపాండియన్ నేడొక ప్రకటనలో వెల్లడించారు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కాకినాడ పట్టణ ఆరోగ్య కేంద్రంలో వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. 5 ఏళ్లలోపు పిల్లల్లందరికీ పోలియో చుక్కల్ని తప్పకుండా వేయించాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 54,07,663 మంది 5 ఏళ్ల లోపు పిల్లలకు 38,267 బూత్ లలో పోలియో చుక్కలు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందజేసిన 98,99,300 డోస్ లను ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపించామని తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు అన్ని జిల్లాలకు నోడల్ ఆఫీసర్లను నియమించామన్నారు.
పల్స్ పోలియోను విజయవంతం చేయాలి: పిలుపునిచ్చిన మంత్రి సత్యకుమార్ యాదవ్
ఈనెల 21న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించేందుకు తల్లిదండ్రులు ముందుకొచ్చి భాగస్వాములు కావాలని కోరారు. వైద్య శాఖ అధికారులు, సిబ్బందికి సహకరించాలన్నారు.
పోలియో నేపథ్యం...
2014, మార్చినాటికి భారత్ పోలియో రహిత దేశంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైనేషన్( WHO ) ఇప్పటికే ప్రకటించింది. అయితే పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ దేశాల్లో ఇంకా పిల్లలపై వైల్డ్ పోలియో వైరస్ వ్యాప్తి ప్రభావం ఉండొచ్చన్న ఉద్దేశంతో ప్రపంచ వ్యాప్తంగా దీని నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆఫ్గనిస్తాన్ నుంచి ఈ వైరస్ అక్టోబర్,2025లో జర్మనీకి వ్యాప్తి చెందింది. ఇక మన రాష్ట్రం విషయానికొస్తే 2008, జులైలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చివరి పోలియో కేసు నమోదైంది. భారత్ ను పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు గాను ఇండియా ఎక్స్‌పెర్ట్ అడ్వయిజరీ గ్రూప్(IEAG) చేసిన సిఫారసుల మేరకు 1995 నుంచి నేషనల్ ఇమ్యునైజేషన్ డే((పల్స్ పోలియో దినం) కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ వస్తున్నారు.
పల్స్ పోలియో రోజున అదనంగా ఒక డోస్
మాములుగా జరిగే ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా 5ఏళ్ల లోపు పిల్లలందరికీ(పుట్టగానే, 6 వారాలకు, 10 వారాలకు, 14 వరాలకు, 16 నెలలకు ) 5 డోస్ ల పోలియో (ఓపీవీ) చుక్కల్ని వేస్తారు. పల్స్ పోలియో రోజున అదనంగా ఒక డోస్ ( 2 చుక్కలు) వేస్తారు. 21న పోలియో దినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయిలో(ఎఎన్ఎం, ఆశా వర్కర్, అంగన్వాడీ వర్కర్, స్టాఫ్ నర్సుల బృందం) పిల్లలకు పోలియో చుక్కల్ని వేస్తారు. ఆరోజు పలు కారణాలవల్ల పోలియో చుక్కలు వేసుకోలేకపోయిన పిల్లలకు తిరిగి ఈనెల 22, 23 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి 76,534 బృందాలు పరిశీలిస్తాయి. 1704 మెడికల్ అధికారులు, 39,494 ఇతరులు (ఫార్మసిస్టులు, నర్సింగ్ విద్యార్థులు, ఇతర సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులు), 4206 మంది పర్యవేక్షకులు నేషనల్ ఇమ్యునైజేషన్ డే కార్యక్రమంలో పాల్గొంటారు.
22, 23 తేదీల్లో ఇంటింటికీ 76,534 బృందాలు
పలు ప్రాంతాల్లో తిరిగి పరిశీలించేందుకు గాను మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి మొబైల్ బృందంలో ఒక మెడికల్ ఆఫీసర్ తో పాటు ఇద్దరు సభ్యులు ఉంటారు. ఈనెల 21 నుండి 23 వరకు మొబైల్ బృందాలు పర్యటిస్తాయి. ఈనెల 22, 23 తేదీల్లో ఇంటింటికి వెళ్లి 5 ఏళ్లలోపు పిల్లలందరినీ పరిశీలించి, వారికి పోలియో చుక్కలు వేస్తారు. ఇంటిలోని పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తే “P” గుర్తుతోనూ, ఏ చిన్నారైనా మిస్ అయితే “X” గుర్తు వేస్తారు. అన్ని ట్రాన్సిట్ పాయింట్లలో (బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రధాన ఆస్పత్రులు, మేళాలు, బజార్‌లు మొదలైనవి) ఈనెల 21 నుండి 23 వరకు ట్రాన్సిట్ బృందాలు పర్యటిస్తాయి. గుర్తించిన పలు ప్రాంతాలను (స్లమ్‌లు, సంచార జాతులు, నిర్మాణ స్థలాలు, ఇటుక క్షేత్రాలు, ఇతర వలస ప్రాంతాలు) కవర్ చేయడానికి 1854 మొబైల్ బృందాలు పనిచేస్తాయి. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, మేళాలు, బజార్‌లు, పర్యాటక ప్రదేశాలలో 1140 ట్రాన్సిట్ బూత్‌లను ఏర్పాటు చేశారు.