పులిచింతల ప్రాజెక్టు : ఊడిపోయిన 16వ నెంబర్ గేట్.. వృథాగా పోతున్న వరద నీరు
Pulichintala Dam crest gate damaged.ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు పోటెత్తుతోంది.
By తోట వంశీ కుమార్ Published on 5 Aug 2021 2:17 AM GMTఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని జలాశయాలు నిండు కండను తలపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం భారీ వరదలకు మధ్యప్రదేశ్‌లోని దాతియా జిల్లాలో సింధు నదిపై నిర్మించిన మణిఖేడా వంతెన కొట్టుకోకుపోయిన సంగతి తెలిసిందే. తాజాగా.. గుంటూరు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు 16వ నెంబర్ క్రస్ట్ గేటు ప్రమాదవశాత్తు ఊడిపోయింది. నీటి ఒత్తిడి కారణంగా గేట్ ఊడడంతో వరద నీరంతా వృథాగా పోతున్నది. ఎగువ నుంచి వరద నీరు వస్తుండడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే క్రమంలో గురువారం తెల్లవారు జామున ప్రమాదవశాత్తు గేటు ఊడిపడింది.
దీంతో దాదాపు 1.60లక్షల క్యూసెక్కులపైగా నీరు వృథాగా పోతున్నది. డ్యామ్‌లో నీటి ఒత్తిడి తగ్గించేందుకు ఏడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. అయితే, ఎమర్జెన్సీ గేటు బిగించేందుకు ప్రయత్నించినా వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సాధ్యం కావడం లేదు. గేట్ ఊడడంతో ప్రస్తుతం ముందుజాగ్రత్తగా ప్రాజెక్టుపైకి రాకపోకలను నిలిపివేశారు. డ్యామ్ వద్ద సెక్యూరిటీని పెంచారు. మరో వైపు ఎమర్జెన్సీ గేట్‌ను బిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎగువ నుంచి భారీగా వరద నీరు తరలి వస్తుండడంతో.. పులిచింతల ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. పులిచింతలకు ప్రస్తుతం 2,12,992 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు. ప్రస్తుతం 172.76 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 42.34 టీఎంసీలుగా ఉంది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.