తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్రీరాంనగర్‌లో సంకటహర వరసిద్ధి వినాయక ఆలయంలో సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసింది ఆలయ పూజారేనని సీఐడీ డీఐజీ అశోక్‌కుమార్ వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. రాజమహేంద్రవరం దిశ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2021 జనవరి 1 తేదీన విగ్రహం ధ్వంసం కాగా.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆలయ పూజారి మరల వెంకట మురళీకృష్ణ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారని, దీనిపై స్థానిక పోలీసులు, సీఐడీ పోలీసులు విచారణ జరపగా తానే విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టు పూజారి అంగీకరించారని చెప్పారు.
పూజారి వెంకట మురళీకృష్ణతోపాటు మల్ల వెంకటరాజు, దంతులూరి వెంకటపతిరాజులను అరెస్ట్ చేశామన్నారు. పూజారీ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడని.. వాటిని ఆసరాగా చేసుకొని కొంతమంది అతడికి రూ.30వేల నగదు ఆశచూపి ఆయనచే స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయించారని.. రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేయించినట్లు గుర్తించామన్నామని తెలిపారు. కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదని.. దర్యాప్తు కొనసాగుతుందని, త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.