ఉదయం పూట చిత్తు కాగితాలు ఏరుకొని బతకడం.. రాత్రి అయితే..?

ఒంటరిగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకొని హత్య చేస్తున్న సైకో కిల్లర్ అంకమ్మరావును పల్నాడు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.

By అంజి
Published on : 11 May 2023 7:00 PM IST

Psycho killer, Ankamma Rao, Palnadu district police, APnews

ఉదయం పూట చిత్తు కాగితాలు ఏరుకొని బతకడం.. రాత్రి అయితే..? 

నరసరావుపేటలో వరుస హత్యలు ప్రజలలో ఊహించని టెన్షన్ కు కారణం అయ్యాయి. ఎవరు చేస్తున్నారో.. ఎందుకు చేస్తున్నారో తెలియని పరిస్థితి. ఈ సమయంలో ఓ సైకో కిల్లర్ పేరు బయటకు వచ్చింది. కేవలం చిల్లర డబ్బుల కోసమే అతడు హత్య చేస్తూ ఉన్నాడని తెలిసి పోలీసులు కూడా ఎంతగానో షాక్ అయ్యారు. ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఒంటరిగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకొని హత్య చేస్తున్న సైకో కిల్లర్ అంకమ్మరావును పల్నాడు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. చిల్లర డబ్బుల కోసం అంకమ్మరావు ఈ హత్యలకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.

ఉదయం పూట చిత్తు కాగితాలు ఏరుకొని జీవనం సాగిస్తూ ఉంటాడు అంకమ్మరావు. ఈ సమయంలో ఒంటరిగా ఉన్నవారిని గుర్తించి రాత్రి పూట వారిపై దాడి చేసి హత్యలకు పాల్పడుతుంటాడని పోలీసులు చెప్పారు. అంకమ్మరావు 2022 జూన్ మాసంలో వృద్దురాలిని హత్య చేశాడు. వృద్దురాలి వద్ద ఉన్న రూ. 2 లక్షలను దోచుకున్నాడు. అంకమ్మరావు ఈ హత్య చేసినట్టుగా రుజువు కాకపోవడంతో జైలు నుండి విడుదలయ్యాడు. జైలు నుండి వచ్చిన తర్వాత కూడా అంకమ్మరావు దాడులకు తెగబడుతూనే ఉన్నాడు. వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురిని నిందితుడు అంకమ్మరావు హత్య చేశాడు. ఈ నెల 5వ తేదీన ఓ వృద్దురాలిని హత్య చేశాడు. ఆమె వద్ద ఉన్న రూ. 500లను నిందితుడు ఎత్తుకెళ్లాడు. ఈ నెల 10వ తేదీన వేర్వేరు చోట్ల ఇద్దరిని హత్య చేశాడు. ఒకరి వద్ద రూ. 40, మరొకరి వద్ద రూ.120 దోచుకున్నాడు. అయితే సీసీటీవీ పుటేజీ పరిశీలించగా.. అంకమ్మరావు ఈ హత్యలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అంకమ్మరావును పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Next Story