ముంబై నటి కాదంబరి జత్వానీని వేధింపుల కేసులో ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న ఆంజనేయులును తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా, కస్టడీ పిటిషన్‌పై విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. ఆయన్ను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం మూడు రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో పీఎస్‌ఆర్‌ను మూడు రోజుల కస్టడీకి అప్పగిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది.
పీఎస్ఆర్ ను సీఐడీ అధికారులు మంగళవారం అరెస్ట్ చేసి బుధవారం ఉదయం విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. నటి వేధింపుల కేసులో పీఎస్ఆర్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పీఎస్ఆర్ ఆంజనేయులును రిమాండ్‌కు ఇవ్వాలని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ముంబై నటి వేధింపుల కేసులో సాక్ష్యాలు తారుమారు చేసేందుకు పీఎస్ఆర్ ప్రయత్నించారని కోర్టుకు తెలిపారు. కాగా ఆంజనేయులును సీఐడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు. న్యాయవాదుల సమక్షంలో విచారణ చేయాలని కోర్టు ఆదేశించింది.