ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తుండగా వైసీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. సేవ్ డెమోక్రసీ అంటూ కాసేపు నినాదాలు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు.. తర్వాత సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అసెంబ్లీకి జగన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు నల్లకండువాలతో వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ స్లోగన్స్ ఇచ్చారు. హత్య రాజకీయాలు నశించాలంటూ నినాదాలు చేశారు. వైసీపీ సభ్యుల నిరసన మధ్య గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి తన ప్రసంగాన్ని కొనసాగించారు.
అంతకుముందు నల్ల బ్యాడ్జీలు, నల్ల కండువాలతో నిరసన వ్యక్తం చేస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వచ్చారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ గేటు వద్ద జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేల చేతుల్లో ఉన్న ప్లకార్డులను పోలీసులు లాక్కునే ప్రయత్నం చేశారు. ప్లకార్డులతో వచ్చిన వైసీపీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై వైఎస్ జగన్ మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు. ప్రజా స్వామ్యాన్ని కాపాడటం ముఖ్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, పోలీసుల వైఖరి అత్యంత దారుణంగా ఉందని జగన్ మండిపడ్డారు.