అమరావతి భూ స్కామ్‌పై విచారణ మళ్లీ కొనసాగుతుంది: ఏపీ హోంమంత్రి
గత టీడీపీ హయాంలో అమరావతిలో జరిగిన భూ కుంభకోణంపై విచారణపై సుప్రీంకోర్టు విధించిన స్టే ఎత్తివేతపై హర్షం వ్యక్తం చేసిన
By అంజి Published on 4 May 2023 6:07 AM GMTఅమరావతి భూ స్కామ్‌పై విచారణ మళ్లీ కొనసాగుతుంది: ఏపీ హోంమంత్రి
అమరావతి: గత టీడీపీ హయాంలో అమరావతిలో జరిగిన భూ కుంభకోణంపై విచారణపై సుప్రీంకోర్టు విధించిన స్టే ఎత్తివేతపై హర్షం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత, ఈ కేసులోని ప్రతి కోణాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు దర్యాప్తును పునఃప్రారంభిస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి వేల ఎకరాల భూమిని సమీకరించడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిట్ విచారణపై స్టే విధిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది.
''మేము రాజధానికి సంబంధించిన అన్ని అంశాలను పారదర్శకంగా పరిశీలిస్తాము. ఎవరూ తప్పించుకోలేరు. సత్యమే అంతిమ విజేత అవుతుంది'' అని వనిత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబరు, 2019లో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం గత తెలుగుదేశం పార్టీ (టిడిపి) ప్రభుత్వ ముఖ్య సభ్యులపై వచ్చిన అవినీతి ఆరోపణలను పరిశీలించడానికి క్యాబినెట్ సబ్‌కమిటీని నియమించింది. ప్యానెల్ దాఖలు చేసిన నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం రాజధాని ప్రాంతంలోని భూ లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపేందుకు 10 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది.
అయితే రెండు ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించడంతో జగన్‌మోహన్‌రెడ్డి వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు హైకోర్టు మధ్యంతర స్టే ఇవ్వకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది.