నవంబర్ 11న ప్రధాని నరేంద్రమోదీ విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందింది. పర్యటనలో భాగంగా రూ.400 కోట్లతో చేపట్టనున్న విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం జరిగే భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. ప్రధాని టూర్‌లో ఏపీ సీఎం వైఎస్ జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొంటారు.
ఏపీ బీజేపీ నేతలతోనూ మోదీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని రాక నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ ఇతర అధికారులు నిన్న సమీక్షించారు. కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో బొత్స మాట్లాడుతూ.. నవంబర్‌లో భోగాపురం ఎయిర్‌పోర్టు, సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందన్నారు.
విమానాశ్రయ టెర్మినల్, అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి భూమిని జిఎంఆర్ అధికారులకు అప్పగించాలని జిల్లా కలెక్టర్ ఎ సూర్యకుమారిని ఆయన ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పీఎంఓ కు ప్రతిపాదనలు పంపింది. అలాగే, డిసెంబరు 4న తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో జరగనున్న నౌకా దినోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారని సమాచారం. విశాఖ నుంచి పాలన చేసేందుకు సీఎం జగన్ సిద్ధమవుతోన్న వేళ.. ప్రధాని మోదీ పర్యటన ఆసక్తికరంగా మారింది.