కనీస శ్రద్ధ చూపలేదు.. రూ.4 లక్షలు కూడా ఖర్చు చేయలేకపోయారు
ప్రజారోగ్య పరిరక్షణ, కనీస మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
By అంజి Published on 20 Nov 2024 3:30 AM GMTకనీస శ్రద్ధ చూపలేదు.. రూ.4 లక్షలు కూడా ఖర్చు చేయలేకపోయారు
అమరావతి: ప్రజారోగ్య పరిరక్షణ, కనీస మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం గ్రామానికి రూ.4 లక్షలు ఖర్చు చేసి ఉంటే ప్రజలకు రక్షిత తాగు నీరు అంది ఉండేది... అది కూడా చేయకుండా నిర్లక్ష్యం వహించడంతో రంగు మారిన నీరు పంపుల ద్వారా వెళ్ళే పరిస్థితి నెలకొందన్నారు. ప్రజలకు స్వచ్చమైన నీరు అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు.
ఇటీవల పల్లె పండుగ కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తమ నియోజకవర్గంలో రంగు మారిన నీటి సరఫరా సమస్యను డిప్యూటీ సీఎంకు చెప్పారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా అక్కడ చర్యలకు ఉపక్రమించి నీటి పరీక్షలు నిర్వహించి గ్రామాల్లో ఫిల్టర్ బెడ్స్ మార్చారు. రూ.3.3 కోట్లు నిధులు ఇందుకు వ్యయం చేశారు. ఈ క్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గం వలివర్తిపాడు గ్రామంలో నిర్వహణ పనులకు ముందు, తరవాత ఉన్న జలాల శాంపిళ్లను చూపించారు.
పవన్ కళ్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేస్తూ “ఫిల్టర్ బెడ్స్ నిర్దేశిత సమయంలో మార్చడం, ఇతర ప్రమాణాలను పాటించడంలో ఎక్కడా రాజీపడవద్దు. గత పాలకులు నిర్లక్ష్యపూరిత వ్యవహారాల మూలంగానే డయేరియా లాంటివి ప్రబలాయి. గ్రామీణ నీటి సరఫరా విభాగంవారు ఎప్పటికప్పుడు నిర్దేశిత కాల వ్యవధిలో నిర్వహణ పనులు చేపట్టాలి. ప్రతి ఇంటికీ రక్షిత తాగు నీరు సరఫరా అనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు నిర్మాణాత్మకంగా పనులు చేపడుతున్నాము. గుడివాడ నియోజకవర్గంలో మనం చేసిన విధానాన్ని ఒక మోడల్ గా తీసుకోవాలి” అన్నారు.