రెండు రోజుల పర్యటన నిమిత్తం ఏపీకి రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
President To Tour AP On Dec 4 And 5.రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్
By తోట వంశీ కుమార్ Published on 2 Dec 2022 11:27 AM ISTరెండు రోజుల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆమె రాష్ట్రానికి రానుండడం ఇదే తొలిసారి. ఇంతకముందు రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం ఆమె రాష్ట్రానికి వచ్చారు. ఈ నెల 4న ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి విజయవాడకు వస్తారు. రాష్ట్రపతి పర్యటన వివరాలను గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి సిసోడియా తెలియజేశారు. విశాఖపట్నంలో జరిగే నేవీ డే వేడుకలు, ఇతర కార్యక్రమాలలో ఆమె పాల్గొంటారు.
షెడ్యూల్ ప్రకారం రాష్ట్రపతి ఆదివారం ఉదయం 10.15 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి విజయవాడకు రానున్నారు. అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి తాడిగడప పురపాలక సంఘం పరిధిలోని పోరంకి మురళి రిసార్టులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌర సన్మానానికి ఆమె హాజరుకానున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సన్మానిస్తారు. అనంతరం రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ హరిచందన్ రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన అధికారిక విందులో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకుంటారు.
ఆదివారం సాయంత్రం విశాఖలో జరిగే నేవీడే ఉత్సవాల్లో రక్షణ దళాల సుప్రీం కమాండర్‌గా ముఖ్య అతిథిగా హాజరై, విన్యాసాలను తిలకిస్తారు. అనంతరం రాష్ట్రంలోని పలు అభివృద్ధి పనులకు ఇదే వేదిక పై నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు చేస్తారు.ఆ తరువాత తిరుపతికి వెలుతారు.
సోమవారం ఉదయమే తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అక్కడి గోశాలను సందర్శిస్తారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. అనంతరం తిరుపతి నుంచి నేరుగా ఢిల్లీకి వెళతారు.