భర్తతో గొడవ.. 65 కిలోమీటర్లు నడిచిన నిండు గర్భిణి
Pregnant Woman walks Tirupati to Naidupeta.ఆమె ఓ నిండు గర్భిణీ. భర్తతో గొడవ పడింది. ఆ కోపంతో ఇంటి నుంచి బయటకు
By తోట వంశీ కుమార్ Published on 15 May 2022 10:37 AM ISTఆమె ఓ నిండు గర్భిణీ. భర్తతో గొడవ పడింది. ఆ కోపంతో ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. చేతిలో చిల్లి గవ్వ లేదు. అలా ఒంటరిగా 65 కిలోమీట్లర మేర నడిచింది. ఇంతలో పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆమె అవస్థను గమనించిన ఓ వ్యక్తి 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చాడు. అప్పటికే బిడ్డ కిందకు జారిపోవడంతో ఆమెకు ప్రసవం చేశారు. ఈ ఘటన తిరుపతిలోని నాయుడుపేటలో చోటు చేసుకుంది.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని వైఎస్సార్ నగర్‌కు చెందిన వర్షిణి అనే మహిళ తన భర్తతో కలిసి కూలి పనుల కోసం తిరుపతికి వచ్చింది. చీటికి మాటికి భర్త గొడవ పడుతుండడంతో విసుగు చెందిన ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా తిరుపతి నుంచి కాలినడకన బయలుదేరింది. మార్గ మధ్యంలో ఆగుతూ ఆగుతూ.. రెండురోజుల పాటు నడుచుకుంటూ శుక్రవారం రాత్రి నాయుడు పేటకు చేరుకుంది. మొత్తంగా 65 కిలో మీటర్లు నడవడంతో బాగా అలసిపోయింది.
పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఎవరైనా సాయం చేయాలంటూ వచ్చి పోయే వాహనాలను ఆపింది.ఎవరూ స్పందించలేదు. చివరకు ఓ యువకుడు స్పందించి 108కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. వారు వెంటనే అక్కడకు చేరుకుని ఆమెను అంబులెన్స్‌లోకి ఎక్కించారు. అయితే..అప్పటికే బిడ్డ కిందకు జారిపోతుండడంతో విషయం అంబులెన్స్ సిబ్బందికి తెలుపగా..వారు వెంటనే ప్రసవం చేశారు.
పాలు,రొట్టెలు తినిపించారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. అయితే.. వర్షిణి తన భర్త పేరు, తల్లిదండ్రుల వివరాలు తెలిపేందుకు నిరాకరించింది. దీంతో వైద్య సిబ్బంది దిశ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు పూర్తి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.