ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలకు కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగిపోతుండడంతో గురువారం అర్థరాత్రి నుంచి ప్రభుత్వం పవర్ హాలిడే ను ప్రకటించింది. ఎస్పీడీసీఎల్ పరిధిలో పరిశ్రమలకు విద్యుత్ కోతలు అమలు చేస్తున్నట్లు ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు తెలిపారు. పరిశ్రమలు వారాంతపు సెలవుకు అదనంగా మరో రోజు సెలవు ప్రకటించుకోవాలని, నిరంతరాయంగా పనిచేసే పరిశ్రమలు కూడా తమ అవసరాల్లో 50 శాతం విద్యుత్‌ను మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు.
ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు ఆదేశాల మేరకు.. 253 ప్రాసెసింగ్ పరిశ్రమలు 50 శాతం విద్యుత్‌నే వాడాల్సి ఉంటుంది. 1,696 పరిశ్రమలకు వారంలో ఒకరోజు పవర్ హాలిడేను అమలు చేయాలి. వారాంతపు సెలవుకు అదనంగా ఒక రోజు పవర్ హాలిడేను కొనసాగించాలి. ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు రెండు వారాల పాటు పరిశ్రమలకు పవర్ హాలీడే అమలులో ఉండనుంది.
ఏప్రిల్ 1వ తేదీన 235 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగిందని, బయటి మార్కెట్ నుంచి 64 మిలియన్ యూనిట్లను కొనుగోలు చేసినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. కాగా అన్ని విధాలుగా విద్యుత్‌ను సమకూర్చుకున్నా రోజుకు 40 నుంచి 50 మిలియన్ యూనిట్ల కొరత ఏర్పడుతోందన్నారు. పది, ఇంటర్, ఇతర పోటీ పరీక్షల నేపథ్యంలో గృహావసరాలకు, మరో వైపు వ్యవసాయానికి ఇవ్వాల్సి ఉన్నందున అందుబాటులో ఉన్న విద్యుత్‌ను సర్దడం తప్ప డిస్కంలకు వేరే మార్గం లేదని అంటున్నారు.