ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. స‌ముద్ర తీరంలోని కెర‌టాలు, ఆటుపోట్ల శ‌క్తి నుంచి విద్యుత్ ఉత్ప‌త్తికి రాష్ట్ర ప్ర‌భుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే విశాఖ, కాకినాడ మధ్య తీరంలో 100 కెవి అలల విద్యుత్‌ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సాంప్రదాయేతర విద్యుత్‌ సంస్థ ఆధ్వర్యంలో అలల విద్యుత్‌పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖ తీరం పరిధిలో ఏర్పాటుచేయనున్న విద్యుత్‌ కేంద్రానికి సంబంధించి ఇజ్రాయిల్‌కు చెందిన బికో వేవ్‌ పవర్‌ లిమిటెడ్‌ సంస్థ డెమానిస్ట్రేషన్‌ ఇవ్వనుంది. డెమానిస్ట్రేషన్‌కు అయ్యే ఖర్చు ఆ సంస్థ భరిస్తుంది.

ఆసంస్థ ఇచ్చిన డెమానిస్ట్రేష‌న్‌పై ప్ర‌భుత్వం సంతృప్తి చెందితే.. తొలి ప్లాంటు నుండి 170 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు అదే సంస్థతో జెన్‌కో ఒప్పందం చేసుకోనుంది. మరిన్ని అలల విద్యుత్‌ కేంద్రాలు నెలకొల్పితే వాటిలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ మొత్తాన్నీ రాష్ట్ర జెన్‌కో కొనుగోలు చేయాలి. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఇతర తీర ప్రారతాల్లో కూడా అలల విద్యుత్‌ అవకాశాలపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ బాధ్యతను జాతీయ సముద్ర సాంకేతిక సంస్థ (ఎన్‌ఐఓటి)కి అప్పగించనున్నారు. అధ్యయనం కోసం ఎన్‌ఐఓటి కి రూ.9.60 లక్షలు చెల్లిస్తారు. రాష్ట్ర తీరంలోని 12 ప్రాంతాల్లో దీనిపై అధ్యయనం చేయనున్నారు.
తోట‌ వంశీ కుమార్‌

Next Story