ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 8వ తేదీ నుండి పరీక్షలు జరగాల్సి ఉంటుంది. కానీ నిన్న జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) జేఈఈ మెయిన్ పరీక్షల తేదీలను విడుదల చేసింది. ఇంటర్మీడియట్ పరీక్షలు, జేఈఈ మెయిన్ పరీక్షల తేదీలు ఒకే రోజు ఉన్నాయి. దీంతో ఇంటర్ పరీక్షలపై అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే నేడు ఇంటర్ విద్యామండలి అధికారులు ప్రత్యేక సమావేశం కానున్నారు. ఇంటర్ పరీక్షలు వాయిదా పడితే దాని ప్రభావం 10వ తరగతి పరీక్షలపై పడనుంది. షెడ్యూల్ ప్రకారం.. ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 8 నుండి 28వ తేదీ వరకు జరగాలి. కానీ జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఏప్రిల్ నుండి 16 నుండి 21వ తేదీ వరకు జరగనున్నాయి.
ఏప్రిల్ 16న జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షతో పాటు, ఇంటర్ సెకండ్ఇయర్ గణితం, వృక్ష, పౌరశాస్త్రం, 19వ తేదీన గణితం-2, జంతుశాస్త్రం, చరిత్ర పరీక్షలు ఉన్నాయి. అయితే ఒకేరోజున రెండు పరీక్షలు రాయడం కుదరదు. ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఉంటాయి. జేఈఈ పరీక్షలు ఉదయం 9 నుండి 12 గంటల వరకు, సాయంత్రం 3 నుండి 6 గంటల వరకు ఉంటాయి. ఈ క్రమంలోనే ఇంటర్ పరీక్షల నిర్వహణపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఇంటర్‌ఫస్ట్ ఇయర్ పరీక్షలు యథావిధిగా కొనసాగించి, సెకండ్‌ఇయర్ పరీక్షలు వాయిదా వేస్తే ఎలా ఉంటుందన్న దానిపై అధికారులు ఆలోచనలు చేస్తున్నారు.