ప్రముఖ సంగీత కళాకారిణి జోగులాంబ కన్నుమూత
Popular music artist Mallapragada Jogulamba passed away. ప్రముఖ సంగీత విద్యా ప్రవీణురాలు మల్లాప్రగడ జోగులాంబ (80) కన్నుమూశారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో
By అంజి Published on 13 Nov 2022 4:16 AM GMTప్రముఖ సంగీత విద్యా ప్రవీణురాలు మల్లాప్రగడ జోగులాంబ (80) కన్నుమూశారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం తెల్లవారుజామున విశాఖపట్నంలోని తన స్వగృహంలో జోగులాంబ తుదిశ్వాస విడిచారు. దేశ విదేశాల్లో ఎన్నో సంగీత కచేరీలు చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా వీణా నిలయ విద్వాంసురాలుగా సేవలందించారు. శాస్త్రీయ సంగీతంలో గొప్ప వారసత్వం ఉన్న కుటుంబం నుండి మల్లాప్రగడ జోగులాంబ వచ్చారు. 7 సంవత్సరాల వయస్సులోనే ఆమె సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు.
హెచ్. నరసింహారావు, కె. జోగారావు, 'వైణిక శిరోమణి' వాసా కృష్ణమూర్తిలచే కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందారు. విజయ త్యాగరాజ సభ నిర్వహించిన పోటీల్లో మూడు బంగారు పతకాలు అందుకున్న ఈమె 1996లో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వారు నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు. విశాఖపట్నం ఆల్ ఇండియా రేడియోలో స్టాఫ్ ఆర్టిస్ట్‌గా మల్లాప్రగడ జోగులాంబ పేరు సంగీత ప్రియులందరికీ సుపరిచితం. ఆల్ ఇండియా రేడియోలో ఆమె చేసిన అనేక కార్యక్రమాలు జాతీయ అవార్డులను గెలుచుకున్నాయి.
కళకారులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 21న ఆమెకు సంగీత కళాభారతి బిరుదుతో సత్కరించిన విషయాన్ని గుర్తు కళాభారతి నిర్వాహకులు జీఆర్కే ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. 50 సంవత్సరాలకు పైగా జోగులాంబ గాత్రం, వీణలో అనేక వందల సంగీత కార్యక్రమాలను నిర్వహించింది. విశేష భక్తి రంజని, అపురూప స్వర పల్లవలు, శ్రీ ముత్తయ్య భాగవతార కృతులు, వీణా పంచకం, దేవీ వైభవం, సంప్రదాయ మంగళ హారతులు, గౌరీ శంకర వైభవం, మహతి నాద ఝరి ఆమె చేసిన కొన్ని ప్రముఖ స్వరకల్పనలు.