ఏపీలోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలలో ప్రారంభమైన పోలింగ్
ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలలో సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది.
By Medi Samrat
ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలలో సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. గత కొన్ని వారాలుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజకీయ పార్టీల ప్రముఖ నేతల ఉద్వేగభరితమైన ప్రసంగాలతో కూడిన తీవ్రమైన ప్రచారం తర్వాత ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి (పులివెందుల), టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (కుప్పం), జనసేన అధినేత, నటుడు పవన్‌కల్యాణ్ (పిఠాపురం) అసెంబ్లీ ఎన్నికల రేసులో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, జగన్ సోదరి వైఎస్ షర్మిల (కడప), బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి (రాజమహేంద్రవరం) తదితరులు లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్నారు.
ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) నుండి వచ్చిన నోట్ ప్రకారం.. జగన్ మోహన్ రెడ్డి సోమవారం కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని భాకరాపురంలో ఓటు వేసి.. ఉదయం 10 గంటలకు తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.
రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ చేస్తోంది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకాల ఒప్పందంలో భాగంగా.. టీడీపీకి 144 అసెంబ్లీ, 17 లోక్‌సభ నియోజకవర్గాలు.. బీజేపీ ఆరు లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేన రెండు లోక్‌సభ, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది.