2028 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పోలవరం నీళ్లు: అమిత్‌ షా

రాష్ట్రాన్ని గాడిన పెట్టడంపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారని హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

By అంజి  Published on  19 Jan 2025 3:09 PM IST
Polavaram water, Amit Shah, APnews, NDRF

2028 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పోలవరం నీళ్లు: అమిత్‌ షా

అమరావతి: రాష్ట్రాన్ని గాడిన పెట్టడంపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారని హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టానికి కేంద్రం మూడింతల సాయాన్ని అందిస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అనుహ్య విజయం అందించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేసిందో అందరికీ తెలిసిందేనని అన్నారు. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో మూడింతల ప్రగతి సాధిస్తామని అమిత్‌ షా అన్నారు. 2028 నాటికి పోలవరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రం మొత్తానికి నీరు సరఫరా అవుతుందని చెప్పారు.

ఎన్డీఆర్‌ఎఫ్‌ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాలకు శిక్షణ ఇచ్చేలా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎం) ప్రాంగణాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల్లో 93 శాతం స్ట్రైక్‌ రేట్‌తో ఘన విజయం సాధించామన్నారు. కేంద్ర ప్రభుత్వ మద్ధతుతో ఏప్రిల్‌ 2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడ సమీపంలోని కొండపావులూరులో ఎన్డీఆర్‌ఎఫ్‌ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు రామ్మోహన్‌ నాయుడు, బండి సంజయ్‌, శ్రీనివాసవర్మ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారా లోకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Next Story