అమరావతి: పోలవరం డయాఫ్రం వాల్ మొత్తం పొడవు 1396 మీటర్లకు గానూ ఇప్పటివరకు 500 మీటర్ల నిర్మాణం పూర్తయిందని..రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ..ఇందులో 3 ట్రెంచ్ కట్టర్లు, 3 గ్రాబర్లతో శరవేగంగా డయాఫ్రంవాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం ముంచేసిన పోలవరం ప్రాజెక్టు పనులను గాడిలో పెట్టాం. స్వయంగా సీఎం చంద్రబాబు విడుదల చేసిన షెడ్యూల్‌కు అనుగుణంగా పనులు చేపడుతున్నాం. వరద సమయంలో కూడా పనులకు ఆటంకం కాకుండా నిర్మాణం చేపడుతున్నాం. అలాగే ఎగువ కాఫర్ డ్యామ్‌ను బలోపేతం చేసేలా బట్రస్ డ్యామ్ నిర్మాణ పనులు ఇప్పటికే 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. మొత్తంగా 2027 డిసెంబరు నాటికి పోలవరం ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం..అని మంత్రి నిమ్మల వివరించారు.