కందుకూరు ఘటన.. ప్రధాని మోదీ, సీఎం జగన్ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
PM Modi shocks over the Kandukur incident announces ex-gratia to Kin of deceased.కందుకూరులో నారా చంద్రబాబు
By తోట వంశీ కుమార్ Published on 29 Dec 2022 12:26 PM ISTనెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు సభలో తొక్కిసలాట చోటు చేసుకుని ఎనిమిది మంది మరణించగా పలువురు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
బహిరంగ సభలో తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాన మంత్రి జాతీయ సహాయనిధి(పీఎంఎన్ఆర్ఎఫ్) కింద మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు తెలిపారు.
పిఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబసభ్యులకు రూ.2 లక్షలు,క్షతగాత్రులకు రూ. 50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తాం : పిఎం @narendramodi
— PMO India (@PMOIndia) December 29, 2022
బాధిత కుటుంబాలకు జగన్ సాయం
కందుకూరు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
నెల్లూరు జిల్లా కందుకూరు ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సీఎం శ్రీ వైయస్.జగన్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మృతులకు రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 29, 2022
గవర్నర్ దిగ్భ్రాంతి..
కందుకూరు తొక్కిసలాట ఘటనపై గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
బుధవారం రాత్రి కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి' సభకు కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో మొత్తం 8 మంది మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.