ఏపీ రైతులకు భారీ శుభవార్త.. ఖాతాల్లోకి రూ.6,000
పీఎం కిసాన్ పథకంతో కలిపి అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనున్నట్టు కూటమి ప్రభుత్వం తెలిపింది.
By - అంజి |
ఏపీ రైతులకు భారీ శుభవార్త.. ఖాతాల్లోకి రూ.6,000
అమరావతి: పీఎం కిసాన్ పథకంతో కలిపి అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనున్నట్టు కూటమి ప్రభుత్వం తెలిపింది. కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ నెల 13న సీఎం చంద్రబాబు 46.80 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,808 కోట్లు జమ చేయనున్నారు. పీఎం కిసాన్ కింద రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.4 వేలు కలిపి మొత్తం రూ.6 వేలు డిపాజిట్ కానున్నాయి. ఇప్పటికే రెండు విడతలుగా ప్రభుత్వం రూ.6,309 కోట్లను రైతు కుటుంబాలకు పంపిణీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నదాతలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మూడో విడత నిధులను ఈ నెల 13వ తేదీన విడుదల చేసేందుకు సర్కార్ సర్వం సిద్ధం చేసింది. అస్సాంలోని గువాహటిలో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని నిధులు విడుదల చేయనుండగా, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నగదును జమ చేయనున్నారు.
ఎవరెవరికి ఎంత లబ్ధి?
ఈ మూడో విడత ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 46.80 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఒక్కో రైతు ఖాతాలో రూ. 6,000 జమ కానున్నాయి. ఈ మొత్తంలో: పీఎం కిసాన్ (కేంద్రం వాటా): రూ. 2,000, అన్నదాత సుఖీభవ (రాష్ట్రం వాటా): రూ. 4,000
కూటమి హామీ నెరవేరుస్తోంది..
ఎన్నికల హామీ మేరకు ఏడాదికి ఒక్కో రైతుకు రూ. 20,000 (రాష్ట్రం రూ. 14,000 + కేంద్రం రూ. 6,000) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రెండు విడతల్లో కలిపి ఒక్కో రైతుకు రూ. 14,000 చొప్పున మొత్తం రూ. 6,309.44 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. తాజా మూడో విడత రూ. 6,000తో కలిపి ఈ ఏడాదికి ఇచ్చిన హామీని ప్రభుత్వం పూర్తి చేయనుంది. ఈ విడత కోసం ప్రభుత్వం మొత్తం రూ. 2,808 కోట్లను వెచ్చిస్తోంది.