కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కిన వారికి ఫోన్‌ కాల్స్‌.. టీడీపీ ఎంపీల్లో ఎవరికి ఫోన్‌ వచ్చిందంటే?

మరికొద్ది గంటల్లో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరనుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

By అంజి  Published on  9 Jun 2024 11:13 AM IST
Phone calls, PMO, central cabinet, NDA, APnews

కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కిన వారికి ఫోన్‌ కాల్స్‌.. టీడీపీ ఎంపీల్లో ఎవరికి ఫోన్‌ వచ్చిందంటే?

మరికొద్ది గంటల్లో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరనుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. నేడు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మోదీ టీమ్‌లో ఎవరెవరు ఉంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ నుంచి ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయనే దానిపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఈ క్రమంలోనే సెంట్రల్‌ కేబినెట్‌లోకి ఇద్దరు టీడీపీ ఎంపీలకు స్థానం ఖరారయిందని సమాచారం. కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కిన వారికి పీఎంవో నుంచి ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. టీడీపీ ఎంపీలు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు నితిన్‌ గడ్కరీ, మేఘ్‌వాల్‌, శర్బానంద సోనోవాల్‌, జితేంద్ర సింగ్‌, షిండే వర్గం శివసేన నేత ప్రతాప్‌ రావ్‌ జాదవ్‌, జేడీఎస్ నేత కుమారస్వామికి ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. నేడు వీరంతా ప్రధాని మోదీతో పాటు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

శ్రీకాకుళం నుంచి 3వ సారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్‌నాయుడికి కేబినెట్‌ మంత్రి పదవి దక్కనుంది. అయితే వీరికి ఏయే శాఖలను కేటాయిస్తారనే దానిపై స్పష్టత లేదు. గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీతోపాటు వీరిద్దరు కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం. టీడీపీ 16 ఎంపీ స్థానాలు గెలిచింది. ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీ టీడీపీనే. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో టీడీపీకి మరో రెండు మంత్రి పదవులు దక్కనున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం. మంత్రి పదవులు దక్కించుకున్న రామ్మోహన్‌నాయుడు, చంద్రశేఖర్‌లకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్‌ చేసి విషెస్‌ తెలిపారు.

Next Story