టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర కడప జిల్లాలో సాగుతోంది. ప్రొద్దుటూరులో లోకేష్ మీదకు జనంలోంచి కొందరు కోడిగుడ్లు విసిరారు. యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ కు ఏ చిన్న ప్రమాదం జరిగినా రాష్ట్రప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలుగుదేశం నాయకులు అచ్చెన్నాయుడు, నక్కా ఆనంద్ బాబు తదితరులు రాష్ట్ర గవర్నరును కలిసి ఫిర్యాదు చేశారు. కోడిగుడ్లు విసిరిన ఆకతాయిలను పోలీసులు అరెస్టు చేశారు. లోకేష్, చంద్రబాబులకు వ్యతిరేకంగా ఫ్లెక్సిలు కట్టడాన్ని కూడా గవర్నరు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనలపై ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు. టీడీపీ వారే తమకు సెల్ఫీ ఇవ్వలేదని నారా లోకేశ్‌ను కోడిగుడ్లతో కొట్టారని పేర్ని నాని అన్నారు. పాదయాత్ర చేస్తోన్న నారా లోకేశ్ ప్రజా ప్రతినిధి కూడా కాదని చెప్పారు. చంద్రబాబు నాయుడు తన కుమారుడికి భద్రత కరవైందని గవర్నర్ కు ఫిర్యాదు చేశారని.. మాజీ ముఖ్యమంత్రి కుమారుడికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువగానే భద్రత ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోందని.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను అమలు చేశారని చెప్పుకొచ్చారు. సీపీఎస్ ను రద్దు చేస్తానని మచిలీపట్నంలో పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారని పేర్ని నాని గుర్తు చేశారు. సీపీఎస్ ను రద్దు చేసి జీపీఎస్ ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని తెలిపారు.