రాజధాని అమరావతి కోసం రైతులు చేపట్టనున్న రెండో విడత మహాపాదయాత్రపై మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహాపాదయాత్రపై నిప్పులు చెరిగారు. ఉద్యమం పేరుతో టీడీపీ వసూళ్లకు పాల్పడుతోందని విమర్శించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విషం కక్కడమే ప్రతిపక్షాల ఏకైక ధ్యేయమని పేర్ని నాని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది నాటి చంద్రబాబు ప్రభుత్వమేనని ఆరోపించారు.
ప్రభుత్వంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని నాని మండిపడ్డారు. పేదలకు ప్రభుత్వం స్థలాలు ఇవ్వడం తప్పా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని అభిప్రాయపడ్డారు. బాబు పాదయాత్ర అంటూ మళ్లీ డ్రామాకు తెరలేపారని ధ్వజమెత్తారు. పాదయాత్రకు కలెక్షన్ ఫుల్.. సానుభూతి నిల్ అంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ తన మూడేళ్ల పాలనా కాలంలో 75 హామీలను నెరవేర్చారని పేర్ని నాని చెప్పారు.
టీడీపీ హయాంలో చంద్రబాబు రాజధాని అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లకు పడగలెత్తారన్నారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా నిలపాలని చేపట్టిన అమరావతి ఉద్యమం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 12 నుంచి అమరావతి పరిరక్షణ సమితితో పాటు పలు రైతు సంఘాలు మహాపాదయాత్ర నిర్వహిస్తున్నాయి. అమరావతి నుంచి అరసవల్లి వరకు యాత్ర జరగనుంది. మహాపాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఉద్యమ నేతలు నిన్న హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.