ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని అన్నారు. టాలీవుడ్ ప్రతినిధుల బృందం గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో భేటీ అయ్యారు. రెండు గంటలపాటు ఈ భేటీ జరిగింది. అనంతరం మంత్రి నాని మీడియాతో మాట్లాడుతూ.. చిన్న బడ్జెట్ సినిమాలను ప్రోత్సహించాలని సినీ ప్రముఖులు కోరారు. సినీ పరిశ్రమను ఆదుకుంటామని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం ఎలాంటి సహాయం కావాలన్నా అందజేస్తుందని సీఎం జగన్ చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి అన్నింటిని సమన్వయం చేశారని.. సినీ పరిశ్రమ సమస్యలపై కమిటీ వేశారని మంత్రి నాని గుర్తు చేశారు. ప్రతి అంశాన్ని సీఎం వైఎస్ జగన్‌తో చర్చించామని చిత్ర పరిశ్రమ ప్రతినిధులు తెలిపారు. కాగా, సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలన్నింటినీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు చిరంజీవి తెలిపారు. ఈ సమావేశానికి చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణ మురళి, ఆర్ నారాయణ మూర్తి, నిరంజన్ రెడ్డి, అలీ వంటి ప్రముఖులు హాజరయ్యారు. టికెట్ రేట్ల పెంపుపై త్వరలో అధికారికంగా జీఓ విడుదలవుతుందని టాలీవుడ్ హీరోలు, దర్శకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా విశాఖపట్నంలో షూటింగ్ కోసం ఆంధ్రప్రదేశ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి టాలీవుడ్ ప్రతినిధులను కోరినట్లు చిరంజీవి తెలిపారు. షూటింగ్‌లకు అన్ని విధాలా సహకరిస్తామని సీఎం హామీ ఇచ్చారని మెగాస్టార్ పేర్కొన్నారు.