ఊహించని రీతిలో ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు.
"గౌరవనీయులైన భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ జీ, మీరు భారత్‌కు అంకితభావంతో విలువైన సేవ చేసినందుకు మీకు ధన్యవాదాలు. మీ పదవీకాలం అంతా మీరు ఉపరాష్ట్రపతి పదవి గౌరవాన్ని అచంచలమైన నిబద్ధతతో నిలబెట్టారు. రాజ్యాంగ విలువలను కాపాడుకున్నారు. దయ, నిష్పాక్షికత, సమగ్రతతో మీరు బాధ్యతలు నిర్వహించారు. రాజకీయ ఒత్తిడి లేకుండా మీ నిర్భయమైన అభిప్రాయాల వ్యక్తీకరణ ప్రజా జీవితానికి ఒక ఉన్నత ప్రమాణాన్ని నిర్దేశించింది. గౌరవనీయమైన పాత్ర నుంచి వైదొలగుతున్న మీకు మంచి ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతమైన జీవనం ఉండాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని పవన్ తన పోస్టులో రాసుకొచ్చారు.
కాగా, జగదీప్ ధన్‌ఖడ్ 2022 ఆగస్టు 11 నుంచి భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు అందుకున్నారు. రాజ్యసభ ఛైర్మన్‌గా సేవలు అందించారు. అంతకుముందు, ఆయన 2019 నుంచి 2022 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా కూడా పనిచేశారు. తన రాజీనామాకు ముందు, ఆయన పార్లమెంటు వర్షాకాల సమావేశాలను రాజ్యసభ ఛైర్మన్‌గా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా, రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, ఆరోగ్యకరమైన చర్చలు జరపాలని ఆయన రాజకీయ పక్షాలను కోరారు.