ఇప్పుడు జనసేనాని అని పిలవండి చాలు : పవన్ కళ్యాణ్
Pawan Kalyan Speech in Rajamahendravaram.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన రాజమహేంద్రవరంలో కొనసాగుతోంది.
By తోట వంశీ కుమార్ Published on 2 Oct 2021 2:36 PM ISTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన రాజమహేంద్రవరంలో కొనసాగుతోంది. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా హుకుంపేటకు చేరుకోనున్న పవన్ కళ్యాణ్.. బాలాజీనగర్‌లో కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. పనులు జరగనప్పుడు ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కును ఎవరూ అడ్డుకోరన్నారు. మీరు ఎంత తొక్కే కొద్ది అంత పైకి లేస్తామని.. అంతేకానీ కానీ వంగేది లేదన్నారు. వీర మహిళలకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. శ్రమదానం తనకి సరదా కాదన్నారు.
ఇక రాజకీయ పార్టీ నడపడం అంత సులభం కాదని.. రాజకీయం అనేది కష్టమైన ప్రక్రియ అని తెలిపారు. తాను నిలబడటానికి ఎన్నో దెబ్బలు తిన్నానని.. ఒడిదొడుకులు, ఓటములు అధిగమించి నిలబడేందుకు వచ్చానని తెలిపారు. మనం కట్టే పన్నులు ప్రభుత్వ ఖజానా వెలుతాయన్నారు. ప్రభుత్వం వద్ద నిధులు ఉన్నాయని.. మౌళిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు. గాంధీ స్పూర్తితో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ప్రజల కోసమే తిట్లు తింటున్నానని చెప్పారు. ఇంతకాలం మానసిక అత్యాచారం భరించానని.. ఎన్నో మాటలు పడ్డాననన్నారు. తన సహనాన్ని తేలికగా తీసుకోవద్దని పవన్ చెప్పారు.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే..'సీఎం.. సీఎం.. సీఎం.. ' అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో కాసేపు ప్రసంగాన్ని ఆపిన పవన్.. ఒక్క నిమిషం ఆగండి. సీఎం అనేది జరిగినప్పుడు అరవండి.. అప్పటి వరకూ ఒక్కరు కూడా సీఎం అని అరవకండి. ఇప్పుడు జనసేనాని అని పిలవండి అని అభిమానులకు పవన్ కళ్యాణ్ సూచించారు.