నాదెండ్ల మనోహర్‌ అరెస్ట్‌పై పవన్‌ కళ్యాణ్ సీరియస్

విశాఖపట్నంలోని టైకూన్ సెంటర్ మూసివేతపై వివాదం కొనసాగుతోంది.

By Srikanth Gundamalla
Published on : 11 Dec 2023 2:24 PM IST

pawan kalyan, serious,  nadendla arrest, janasena,

నాదెండ్ల మనోహర్‌ అరెస్ట్‌పై పవన్‌ కళ్యాణ్ సీరియస్

విశాఖపట్నంలోని టైకూన్ సెంటర్ మూసివేతపై వివాదం కొనసాగుతోంది. రియల్‌ ఎస్టేట్ వ్యాపారం కోసం ఏకంగా రోడ్డు మూసివేయడం దారుణమని జనసేన నేతలు అంటున్నారు. ఈ క్రమంలోనే రోడ్డు తెరవాలంటూ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా టైకూన్ సెంటర్‌కు వెళ్లేందుకు జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ప్రయత్నించారు. ముందస్తుగా అప్రమత్తం అయ్యిన పోలీసులు నాదెండ్ల మనోహర్‌ను అడ్డుకుని ఆయన్ని అరెస్ట్ చేశారు. నాదెండ్ల మనోహర్ అరెస్ట్‌ను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఆయన లేఖను విడుదల చేశారు.

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ అరెస్ట్‌ను పవన్ కళ్యాణ్ ఖండించారు. నాదెండ్ల అరెస్ట్‌ అప్రజాస్వామికం అని పవన్ అన్నారు. విశాఖలోని టైకూన్ జంక్షన్ వద్ద రోడ్డును తెరవాలని కోరితే అరెస్ట్‌ చేస్తారా అని ప్రశ్నించారు. జనసేన శ్రేణులపై పోలీసులు వ్యవహరించిన తీరు అస్సలు సరికాదని అన్నారు. నాదెండ్లతో పాటు అరెస్ట్‌ చేసిన మిగతా పార్టీ నేతలను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. అరెస్ట్‌ చేసిన వారిని విడుదల చేయకపోతే విశాఖపట్నం వస్తాననీ.. అక్కడే పోరాటం మొదలుపెడతా అని వార్నింగ్‌ ఇచ్చారు. ఎంపీ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుకు వాస్తుదోషం ఉందనే కారణంతో రోడ్డును మూసివేశారని పవన్‌ కళ్యాణ్‌ మరోసారి అన్నారు.

నాదెండ్లతో పాటు జనసేన కార్యకర్తల అరెస్ట్‌ను టీడీపీ కూడా ఖండించింది. విశాఖలో అత్యంత రద్దీగా ఉండే ఏరియా టైకూన్‌ జంక్షన్ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ నేతల స్వప్రయోజనాల కోసం రోడ్డును మూసేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం దుర్మార్గం అని అన్నారు. ప్రశ్నించిన జనసేన నేతలను అరెస్ట్ చేయడం మరీ దారుణమన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా అరెస్ట్‌ చేసిన జనసేన నేతలను పోలీసులు వెంటనే విడుదల చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Next Story