గ్యాస్ లీకేజీపై పవన్ : ప్రగతికి పరిశ్రమలు అవసరమే.. అయితే ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కాదు
Pawan Kalyan Response on Atchutapuram Gas Leakage.అచ్యుతాపురం సెజ్‌లో విషవాయువు లీకేజీ ఘటనపై జనసేన అధినేత
By తోట వంశీ కుమార్ Published on 4 Aug 2022 7:20 AM GMTఅచ్యుతాపురం సెజ్‌లో విషవాయువు లీకేజీ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలు ఇంత వరకు తెలియకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "విశాఖనగరం సమీపంలోని ఉన్న అచ్యుతాపురం ఎస్.ఇ.జెడ్ పారిశ్రామిక ప్రాంతంలో తరుచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ఆందోళనకరంగా ఉన్నాయి. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో ఎంత మంది ప్రాణాలను హరించిందో ఎప్పటికీ మరిచిపోలేం.అచ్యుతాపురంలో మంగళవారం సాయంత్రం దుస్తులు తయారు చేసే సీడ్స్ అనే కంపెనీలో విషవాయువు లీకై 125 మంది మహిళలు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలవడం దురదృష్టకరం. ఈ ఘటనకు ప్రజా ప్రతినిధులు, అధికారుల నిర్లిప్తతే కారణం. నెల క్రితం ఇదే కంపెనీలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. అప్పుడు 400 మంది కార్మికులు అస్వస్థతకు గురైయ్యారు. ఇది మళ్లీ పునరావృతమైంది. అయితే ప్రమాదానికి గల కారణాలు అటు అధికారులుగానీ, ఇటు ప్రజా ప్రతినిధులు కానీ చెప్పకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది" అని పవన్ అన్నారు.
"పరవాడ, దువ్వాడ, అచ్యుతాపురం పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న ఔషద, రసాయన, ఉక్కు, ఔళి కార్మాగారాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో చుట్టుపక్కల కాలనీ వాసులు, గ్రామస్తులు ఏ ప్రమాదం ఎప్పుడు ముంచుకొస్తుందో, ఏ విషవాయువు ప్రాణాలు తీస్తుందోనంటూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. రాష్ట్రం, దేశ ప్రగతికి పరిశ్రమలు అవసరమే. అయితే ఆ ప్రగతి ప్రజల ఆరోగ్యం, ప్రాణాలను పణంగా పెట్టి కాదు. పారిశ్రామిక వాడల్లో ప్రమాదాల నివారణకు ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి కట్టుగా పని చేయాలి. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ పకడ్బందీగా చేపట్టాలి. పారిశ్రామిక ప్రగతికి ఏపీ ప్రభుత్వం అవినీతికి తావులేని విధంగా పని చేయాలి. ఎటువంటి వైఫల్యాలు ఎదురైనా ప్రభుత్వ పెద్దలే బాధ్యత వహించాలి. అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో అస్వస్థతకు గురైన మహిళా కార్మికులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం, నష్టపరిహారాన్ని అందించాలని" జనసేనాని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
అచ్యుతాపురం సెజ్ ప్రమాదాలను అరికట్టలేరా ? - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/qfn0nwmWuZ
— JanaSena Party (@JanaSenaParty) August 4, 2022