వాలంటీర్లతో తప్పుడు పనులు చేయిస్తున్నారు: పవన్ కళ్యాణ్
మరోసారి పవన్ కళ్యాణ్ వాలంటీర్ల గురించి కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 15 July 2023 8:36 AM ISTవాలంటీర్లతో తప్పుడు పనులు చేయిస్తున్నారు: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో వుమెన్ ట్రాఫికింగ్, వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన రాష్ట్ర మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అంతేకాదు.. వాలంటీర్లు ఆయనపై కేసు నమోదు కూడా చేయించారు. ఏపీ మహిళా కమిషన్ అయితే వివరణ ఇవ్వాలంటూ నోటీసులు కూడా జారీ చేసింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ వాలంటీర్ల గురించి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారమే రేపుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి పవన్ కళ్యాణ్ వాలంటీర్ల గురించి కామెంట్స్ చేశారు.
శివశ్రీ అనే వాలంటీర్ కన్నీళ్లు తమ జనవాణి కార్యక్రమానికి నాంది అని అన్నారు పవన్ కళ్యాణ్. తాను వాలంటీర్లకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదని..వారి కడుపు కొట్టే వ్యక్తిని కాదని అన్నారు. రూ.5వేలకు ఇంకో రూ.5వేలు కలిపి ఇచ్చే వ్యక్తిని అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. అయితే వాలంటీర్లు జగన్ పాలన వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు. మీకు తెలియకుండానే జగన్ ప్రభుత్వం మీతో తప్పులు చేయిస్తోందని అన్నారు. గతంలో వైఎస్ రాజశస్త్రకర్‌రెడ్డి ప్రభుత్వంలో కూడా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఒత్తిడికి లొంగి తప్పుపు చేశారు.. దాని ఫలితంగా జైలుకెళ్లిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా మీతో అలాగే తప్పు చేయిస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని భవిష్యత్‌లో ఇబ్బందులు పడతారని వాలంటీర్లకు పవన్ కళ్యాణ్ సూచించారు.
ప్రభుత్వంలో ఒక శాఖ నుంచి మరో శాఖకు డేటా బదిలీ అవ్వాలంటే లిఖితపూర్వక ఉత్తర్వులు ఉంటాయని పవన్ అన్నారు. మరి వాలంటీర్ల నుంచి డేటా పంపించడానికి ఏ లిఖతపూర్వక అనుమతి ఉందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రూ.164 రోజూవారీ జీతంతో జగన్ మీతో తప్పు చేయిస్తున్నారు.. మీరు చేసే తప్పుకు మీరే బలవుతారని.. ఇది గుర్తుంచుకోవాలంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల డేటా వాట్సాప్ గ్రూప్‌లో నుంచి ఎటు వెళ్తోందని ప్రశ్నించారు. వాలంటీర్ల వ్యవస్థకు అధిపతి ఉన్నారా? నవ్వి ఊరుకుంటే సరిపోదని.. జవాబుదారీగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ అన్నారు. వాలంటీర్లకు వైసీపీ కండువాలు వేయడం ఎందుకు అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వాలంటీర్ల గురించి పవన్ మాట్లాడితే రాజకీయంగా దుమారం రేగుతోంది. అయినా కూడా పదేపదే అయినా ప్రభుత్వాన్ని నిలదీసి అడిగే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.