పవన్ ప్రకటనతో పిఠాపురం టీడీపీలో అలజడి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla
పవన్ ప్రకటనతో పిఠాపురం టీడీపీలో అలజడి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తాను పోటీ చేయాలనుకుంటున్న అసెంబ్లీ స్థానం పేరును చెప్పారు. పిఠాపురం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. కూటమితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పారు పవన్. అయితే.. పవన్ ప్రకటతో పిఠాపురం టీడీపీలో అలజడి రేగింది.
పిఠాపురం టీడీపీ అభ్యర్థిగా ఎన్‌వీఎస్ఎన్ టికెట్ ఆశించారు. ఈ మేరకు ఆయనకే టికెట్ దక్కుతుందనీ కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుచరులు భావించారు. దాంతో.. జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ.. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటనతో పిఠాపురం టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. ఎన్‌వీఎస్‌ఎన్ వర్మ అనుచరులు ఆందోళనకు దిగారు. పిఠాపురం టీడీపీ కార్యాలయం వద్దకు చేరకుని ఆందోళన చేశారు. నిరసనలో భాగంగా ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. టీడీపీ కార్యాలయంలో ఉన్న పేపర్లను, ఫ్లెక్సీలను తగలబెట్టారు. అంతేకాదు.. తమ వాహనాలకు ఉన్న చంద్రబాబు, లోకేశ్ ఫొటోలను చించేశారు. వర్మకు పార్టీ మోసం చేయొద్దంటూ మండిపడ్డారు. ఎన్‌వీఎస్‌ఎన్ వర్మ స్వతంత్రంగా అయినా పోటీ చేయాలంటూ కోరారు ఆయన అనుచరులు.
ఇక దీనిపై స్పందించిన ఎన్‌వీఎస్‌ఎన్ రేపు కార్యాకర్తలతో మాట్లాడుతాననీ, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. పవన్ కళ్యాన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటన చేశారు కానీ.. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదనీ చర్చలు జరుగుతాయని చెప్పిన విషయం తెలిసిందే. మరి దీనిపై టీడీపీ అధిష్టానం పవన్‌తో ఎలా సంప్రదిస్తుంది? ఎన్‌వీఎస్‌ఎన్‌తో ఏం మాట్లాడుతారు? అనేది ఉత్కంఠగా మారింది.