అయోధ్య రామాల‌య నిర్మాణంలో అంద‌రిని భాగ‌స్వాములు చేయాల‌నే ఉద్దేశ్యంతో విరాళాలు సేక‌రిస్తున్నారు. రామాలయ నిర్మాణం కోసం బీజేపీ, హిందూ సంఘాలు పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తున్నాయి. ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు భారీగా విరాళాలు ప్ర‌క‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా రామాల‌యం నిర్మాణానికి త‌న వంతుగా రూ.30ల‌క్ష‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. తిరుపతిలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కోసం వచ్చిన జనసేనాని.. ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. అంతేకాకుండా.. తన కార్యవర్గంలో ఉన్న ఇతర మతాలకు చెందినవారు కూడా రూ.11 వేలు అందించారని, దాని తాలూకు డీడీని కూడా అందిస్తున్నానని చెప్పారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాముడి ప్రాశస్త్యాన్ని వివరించారు. ఓ మహాపండితుడు రామో విగ్రహవాన్ ధర్మః అన్నారని, రాముడు ధర్మానికి ప్రతిరూపం అనేది దానర్థం అని తెలిపారు. రాముడు సహనం, శాంతి, శౌర్యం వంటి గుణాలను ప్రదర్శించాడని, ఈ దేశం అనేక దాడులు, అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా బలంగా నిలబడిందంటే అందుకు కారణం రాముడు చూపిన మార్గమేనని పవన్ ఉద్ఘాటించారు. అన్ని వర్గాలను ఆమోదించే విధంగా భారతదేశం ఉందంటే అది రాముడి చలవేనని అన్నారు. అందుకే రామరాజ్యం అంటామని వివరించారు.
తోట‌ వంశీ కుమార్‌

Next Story