'చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి'.. పవన్ కల్యాణ్ డిమాండ్

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సినీనటుడు, రాజకీయ నాయకుడు పవన్ కల్యాణ్ బుధవారం డిమాండ్ చేశారు.

By అంజి  Published on  8 March 2023 6:06 PM IST
Pawan Kalyan, reservations

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (ఫైల్‌ ఫొటో)

హైదరాబాద్: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సినీనటుడు, రాజకీయ నాయకుడు పవన్ కల్యాణ్ బుధవారం డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ (జెఎస్‌పి) అధినేత ఈ డిమాండ్‌ను తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారని నొక్కి చెప్పారు. 33 శాతం రిజర్వేషన్ల సాధనకు రాజకీయంగా నిరంతరం కృషి చేస్తానన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా.. మహిళలందరికీ ఈ రోజు శుభాకాంక్షలు తెలిపారు.

''మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధిగా నిలబడేలా, సాధికారత సాధించేలా చట్టసభల్లో మహిళలకు సీట్ల సంఖ్య తప్పనిసరిగా పెరగాలని నేను గట్టిగా డిమాండ్‌ చేస్తున్నాను'' అని అన్నారు. ''స్త్రీ శక్తి స్వరూపిణి.. స్త్రీ బహురూపాలలో కనిపిస్తుంది..స్త్రీ బహుముఖ ప్రజ్ఞాశాలి.. స్త్రీ మానవ సృష్టికి మూలకర్త. ఇంత గొప్ప స్త్రీకి ప్రతిఫలంగా ఏమి ఇవ్వగలం? తల్లిగా, చెల్లిగా, జీవిత భాగస్వామిగా, కూతురిగా వివిధ రూపాల్లో మన మధ్య ఉన్న ఓ ఆడబిడ్డ చేసిన సేవలు వెలకట్టలేనివి. స్త్రీ లేని ఇల్లు ఒక వెలుగు లేని దేవాలయం లాంటిది'' అని పవన్ కళ్యాణ్ తన సందేశంలో పేర్కొన్నారు.

''మహిళలను ఎక్కడ గౌరవిస్తారో అక్కడ దేవతలు ఉంటారని మేము నమ్ముతాం. ఇది నిజం. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో, అక్కడ శాంతి, సంపదలు వర్ధిల్లుతాయని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. కానీ, సమాజం, ప్రభుత్వాలు స్త్రీల పూర్తి సాధికారతను సాధించడానికి, వారు స్వేచ్ఛతో జీవించడానికి చాలా ఎక్కువ శ్రద్ధ వహించాలి. మహిళలపై అఘాయిత్యాలు లేని సమాజాన్ని నెలకొల్పేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి'' అని పవన్‌ అన్నారు.

Next Story