కూటమి సర్కార్ వచ్చాక గంజాయి ముఠాను అణచివేస్తాం: పవన్ కల్యాణ్‌

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పాల్గొన్నారు.

By Srikanth Gundamalla  Published on  27 April 2024 9:30 PM IST
pawan kalyan, comments, ycp government, andhra pradesh,

కూటమి సర్కార్ వచ్చాక గంజాయి ముఠాను అణచివేస్తాం: పవన్ కల్యాణ్‌

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ సర్కార్‌పై విమర్శలు చేశారు. ఏపీలో దాదాపు 30వేల మంది మహిళలు అదృశ్యం అయినా సీఎం జగన్ ఒక్కసారి కూడా స్పందించలేదని అన్నారు. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా గంజాయి దొరుకుతుందని.. ఇది రాష్ట్ర ప్రజల భవిష్యత్‌కు ఏమాత్రం మంచిదికాదని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పాటు కాబోతుందని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక గంజాయిని విక్రయించే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

జగన్‌ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారనే విషయం మర్చిపోయి.. సీఎంలా కాకుండా సారా వ్యాపారిలా మాట్లాడుతున్నారంటూ పవన్ కల్యాణ్‌ ఫైర్ అయ్యారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే కన్నబాబు అవినీతికి అడ్డుఅదుపు లేకుండా పోయింది. రియల్‌ ఎస్టేట్ వ్యాపారులు లేఅవుట్‌ వేస్తే కన్నబాబుకి ముడుపులు ఇవ్వాల్సి వస్తోందని చెప్పారు. వైసీపీ నాయకుల వేధింపులు తాళలేకే ఓ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడని పవన్ కల్యాణ్‌ అన్నారు.

యువత జగన్‌ సర్కార్‌పై పోరడాలని పవన్ కల్యాణ్‌ అన్నారు. రౌడీయిజానికి భయపడితే ఎక్కడికి పారిపోతారు.. జగన్‌ను గద్దె దించేవరకు పోరాడాలని అన్నారు. ఐదేళ్లలో రూ.70 కోట్లు ట్యాక్స్‌ కట్టానంటే ఎంత సంపాదించగలనో అర్థం చేసుకోవాలని పవన్ అన్నారు. ప్రజల కోసమే తాను రోడ్లపైకి వచ్చాననీ.. వారికి న్యాయం జరగాలన్నదే తన ధ్యేయమని పవన్ కల్యాణ్‌ అన్నారను. 30వేల మంది ఆడబిడ్డలు రాష్ట్రంలో అదృశ్యం అయితే కనీసం ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఒక్క ప్రకటన చేయకపోవడం దారణమని పవన్ అన్నారు. వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని.. అప్పుడే సమాజం బాగుపడుతుందని పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.

Next Story