ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. వైసీపీ సింగిల్ గా వచ్చే ఎలెక్షన్స్ లో పోటీకి దిగబోతూ ఉండగా.. టీడీపీ తమతో కలిసి వచ్చే వారి కోసం ఎదురుచూస్తూ ఉంది. ముఖ్యంగా జనసేన తమతో కలిసి వస్తుందని భావిస్తూ ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం అటు బీజేపీతోనే ఉన్నానని అంటున్నా.. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చమని మాత్రం చెప్పుకుంటూ వస్తున్నారు.
ఇలాంటి సమయంలో టీడీపీ నేత పితాని సత్యనారాయణ బీజేపీపై మండిపడ్డారు. ఈ దేశానికి బీజేపీ అవసరమా అని ప్రజలు ప్రశ్నించే రోజు రాబోతోందన్నారు. బీజేపీ ముందు ఒక రాజకీయం, వెనక ఒక రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీలోకి కలవడానికి వస్తున్నారని.. అయితే ఆయన్ను బీజేపీ భయపెడుతోందన్నారు. పవన్‌కు తాళం వేయాలని చూస్తోందని విమర్శించారు. పవన్ కళ్యాణ్‌ను బీజేపీ ఎంతకాలం అడ్డుకుంటుందో చూస్తామన్నారు. బీజేపీ ఈ ద్వంద వైఖరి, తప్పుడు రాజకీయం మానుకోవాలని హితవుపలికారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర వహిస్తూనే ఢిల్లీలో బీజేపీ జగన్మోహన్ రెడ్డికి తాబేదారుగా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పించారు.