విచారణ చేయండి.. జైలుకైనా, దెబ్బలు తినేందుకైనా సిద్ధం: పవన్

ప్రాసిక్యూషన్‌కు తాను సిద్ధంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు.

By Srikanth Gundamalla  Published on  21 July 2023 6:11 AM
Pawan Kalyan, AP Government, Volunteer, Prosecution,

విచారణ చేయండి.. జైలుకైనా, దెబ్బలు తినేందుకైనా సిద్ధం: పవన్

వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రస్తుతం పవన్‌ చేసిన వ్యాఖ్యల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇప్పటి వరకు అధికార పార్టీ నేతలు పవన్‌కు కౌంటర్‌గా ప్రెస్‌మీట్లు పెట్టగా.. ఈసారి ప్రభుత్వమే రంగంలోకి దిగింది. పవన్‌ చేసిన వ్యాఖ్యలపై విచారణకు జీవో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసార మాద్యమాల్లో వార్తల ఆధారంగా పవన్‌ కళ్యాణ్‌పై కేసు నమోదు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జీవోను జనసేన పార్టీ ఆఫీస్‌కు పంపించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఇచ్చిన జీవోపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. తాను అన్నింటికీ సిద్ధపడే ఏదైన మాట్లాడతానని చెప్పారు. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొంటానని, జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని, చిత్రహింసలకు కూడా పెట్టుకోండి అంటూ ఏపీ ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. జగన్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయంటూ హెచ్చరించారు పవన్ కళ్యాణ్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధే తన లక్ష్యమని పవన్‌ కళ్యాణ్ అన్నారు. అన్నింటికి సిద్ధపడే ప్రజల ముందు నిజాలను చెప్తున్నానని అన్నారు. తన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం ప్రాసిక్యూషన్‌ కోసం జీవో పంపిందని తెలిపారు. ప్రాసిక్యూషన్‌కు తాను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. మర్డర్‌ చేసే వ్యక్తులకు జగన్ మద్దతుగా ఉన్నారంటూ ఆరోపించారు. వాలంటీర్ల వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు స్పష్టంగా చెప్పానని తెలిపారు. వాలంటీర్లకు అతి తక్కువ జీతాలు ఇస్తున్నారని.. ప్రజలకు సంబంధించిన కీలకమైన డేటాను ఎందుకు సేకరిస్తున్నానని ప్రశ్నించాను అని ఆన్నారు. అయితే.. ఆ డేటా ఎవరికి ఇస్తున్నారని నిలదీశానని మరోసారి చెప్పారు పవన్. నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నోటీసులు పంపారని.. ఇలా విచారణకు పిలిచినంత మాత్రాన తాను భయపడిపోయే వ్యక్తిని కాదని పవన్ కళ్యాణ్‌ అన్నారు. ఏపీ ప్రభుత్వం తప్పులను ప్రశ్నిస్తూనే ఉంటానని, వాలంటీర్లు చేసే తప్పులకు సీఎం జగన్ బాధ్యత వహిస్తారా అంటూ పవన్ నిలదీశారు.

వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని పవన్ కళ్యాణ్‌ అన్నారు. వాలంటీర్ల ద్వారా సేకరిస్తున్న వివరాలు డేటా చౌర్యం కిందకి వస్తుందని అన్నారు. వ్యక్తిగత డేటాను సేకరించే హక్కు లేదంటూ జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు పవన్. వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక ప్రభుత్వం తనకు పంపిన జీవోపై పోరాడతానని తెలిపారు. జనం బాగుండాలంటే జగన్ పోవాలని అన్నారు. జగన్ ప్రభుత్వం చేస్తోన్న అక్రమాలు, అన్యాయాలపై గట్టిగా పోరాడతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్ వాలంటీర్ల గురించి చేసిన వ్యాఖ్యలను ఏపీ సర్కార్ సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. కోర్టుకు వెళ్లాలని కూడా నిర్ణయించింది. ఈ మేరకు స్పెషల్‌ సీఎస్‌అజయ్‌ జైన్‌ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1973 క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ ప్రకారం పవన్ కల్యాణ్ పై చర్యలకు సిద్ధమైంది సర్కార్. వాలంటీర్లపై ఉద్దేశపూర్యకంగా తప్పుడు ఆరోపణలు చేసినందుకు పరువు నష్టం కేసు దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు ఆదేశాలు జారీ చేసింది.

Next Story