అర్థరాత్రి కుప్పకూలిన పాపాగ్ని వంతెన
Papagni bridge collapsed in Kadapa District.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న
By తోట వంశీ కుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించి పలువురు మృతి చెందగా.. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. వరదల కారణంగా పలు చోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో చాలా గ్రామాలకు రాకపోకలు స్తంబించిపోయాయి. వీటిలో కడప జిల్లా కమలాపురంలో పాపాగ్ని నదిపై నిర్మించిన పాపాగ్ని వంతెన ఒకటి.
వెలిగల్లు జలాశయం నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో భారీగా వరద పోటెత్తింది. రెండు రోజులుగా వంతెన వద్ద ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహిస్తుంది. వంతెన అంచుల వరకు నీరు ప్రవహిస్తుండడంతో వంతెన బాగా నానింది. నిన్న సాయంత్రం నుంచి వంతెన కుంగుతూ వచ్చింది. అర్థరాత్రి దాటిన తరువాత ఒక్కసారిగా కుప్పకూలింది. అనంతపురం నుంచి కడపకు వెళ్లే జాతీయ రహదారిపై ఈ బ్రిడ్జి ఉండడంతో వాహన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.
ఆ మార్గంలో వెళ్లే వాహనాలను వేరే మార్గంలోకి దారి మళ్లిస్తున్నారు. బ్రిడ్జి కూలిపోయే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన అధికారులు అప్పటికే బ్రిడ్జిపై నుంచి రాకపోకలను నిలిపివేయడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ మార్గంలో రాకపోకలను పునరుద్దరించడానికి నెల రోజులు సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు.
మరోవైపు.. స్వర్ణముఖి వరద ప్రవాహానికి కేసీపేట, తనపల్లి, తిరుచానూరు గ్రామాల సమీపంలో ఉన్న వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో.. తిరుచానూరు వైపు నుంచి పాడిపేట, ముండ్లపూడి, తనపల్లి, కుంట్రపాకం, వెంకటరామపురం తదితర 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ఉద్దృతి తగ్గితే కానీ వంతెనలు బాగుచేయడం సాధ్యం కాదని.. కనీసం 20 రోజుల సమయం పడుతుందని అధికారులు అంటున్నారు.
కుప్పకూలిన మూడంతస్తుల భవనం
కడప పట్టణంలోని రాధాకృష్ణనగర్‌లో ఈ రోజు(ఆదివారం) తెల్లవారుజామున 4 గంటల సమయంలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద తల్లీ, ఇద్దరు చిన్నారులు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని వారిని కాపాడారు. పెద్ద శబ్దంతో భవనం కూలడంతో భవనంలోని తల్లీ, ఇద్దరు చిన్నారులు చినహా.. మిగిలిన వారు బయటకు పరుగులు తీశారు.