ఏపీలో దేవాలయాలు, దేవతా విగ్రహాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజుల పాటు రాజకీయ నేతలు ప్రమాణాలు అంటూ దేవుడి మీద పడగా.. ఇప్పుడు వరుసగా దేవతా విగ్రహాల ధ్వంసం సంచలనం రేపుతున్నాయి. విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహాం శిరచ్చేదం ఘటన మరువకముందే తాజాగా ప్రకాశం జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. సింగరాయకొండ మండలంలోని పాతసింగరాయకొండ గ్రామంలో దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధిగాంచిన వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లే ముఖ ద్వారంపై ఉన్న మూడు విగ్రహాలు( లక్ష్మీనరసింహ స్వామి, రాజ్యలక్ష్మీ, గరుత్మంతుడు) చేతులు విరిగిపోయి ఉన్నాయి.
ఈ ఉదయం ఈ విషయం గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న సింగరాయకొండ సీఐ శ్రీనివాసులు, ఎస్సై సంపత్‌కుమార్ ముఖద్వారాన్ని, విగ్రహాలను పరిశీలించారు. ఇది ఎవరైనా కావాలని చేశారా..? లేక వాటంతట అవే విరిగిపోయాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో పక్క రామతీర్ధం ఒకరకంగా రణరంగం గా మారింది. విజయనగరం జిల్లా రామతీర్ధంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసం ఘటన ఉద్రికత్తంగా మారింది. టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఐ ఇలా విపక్షాలు అన్నీ ప్రభుత్వం పై విమర్శల దాడికి దిగాయి. ఒక దాని వెంట ఒకటిగా జరుగుతున్న ఈ ఘటనలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయని అంటున్నారు.